రిపోర్టర్ : క్రాంతి
లొకేషన్ : భద్రాద్రి
ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రాంతంలో బీఆర్ఎస్, కమ్యూనిస్టుల పార్టీల మధ్య రేగిన తాజా వివాదం తీవ్రంగానే మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమను చిన్నచూపు చూస్తున్నారని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే కాంతారావు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమంటూ ఈ ప్రాంత కమ్యూనిస్టు నాయకులు విమర్శిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా బీజేపీ పట్ల వ్యతిరేకత కలిగి ఉన్న వామపక్ష పార్టీలు, గత్యంతరం లేని పరిస్థితుల్లోనైనా తమకు మద్దతుగా రావాల్సిందేననే ధోరణి వ్యక్తం చేసిన రేగా కాంతారావు వ్యాఖ్యలపై కమ్యూనిస్టు నాయకులు విరుచుకుపడటం తాజా పరిణామం. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో తమ అవసరం గుర్తించి కేసీఆర్ లాంటివారే తమను దగ్గర చేసుకునే పనిలో ఉండగా, కేవలం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రేగా, తమను చిన్నబుచ్చే వ్యాఖ్యలు చేయడం కామ్రేడ్స్ జీర్ణించుకోలేక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో పొత్తులలో ఉమ్మడి ఖమ్మం , నల్గొండ జిల్లాల్లో ప్రభావం చూపగలిగే తమను కించపరిచేలా ఓ జిల్లా అధ్యక్షుడు వ్యాఖ్యలు చేయడం కామ్రేడ్స్ తట్టుకోలేకపోతున్నారు. అందుకే జిల్లాకు చెందిన సీపీఎం , సీపీఐ సీనియర్ నేతలు పోతినేని సుదర్శన్, సాబిర్ పాషా, తదితర కామ్రేడ్స్ రేగా కాంతారావుపై తీవ్రస్థాయిలో ప్రతివిమర్శలు చేశారు.
ఇప్పటికే పినపాక నియోజకవర్గంలో సొంత పార్టీలోనే పలు వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న కాంతారావు, ఏ ధైర్యంతో తమ ఉనికిని ఈ స్థాయిలో ప్రశ్నించడం ఏంటని మండిపడిన కమ్యూనిస్టు నాయకులు తమ సత్తా ఏంటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. కమ్యూనిస్టులతో పొత్తుల్లో భాగంగా వారికి ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదనే ధోరణితో రేగా కాంతారావు తమ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
\"ఎన్నికల్లో పొత్తులు, సీట్ల విషయంలో మీరేమీ గందరగోళం. కావొద్దు. కమ్యూనిస్టులకు కేవలం ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ ఇస్తాం. ఈ వ్యవహారమంతా మన పెద్దోళ్లు చూసుకుంటారు...\" అంటూ రేగా కామెంట్ చేశారు. పైగా \"ఇపుడు వాళ్లు కూడా మనమిత్రులే. మనసభలకు వాళ్లను కూడా తీసుకురావాలి. మనతోపాటే వాళ్లకు కూడా ఒక బస్ పెట్టండి\" అంటూ సీపీఎం, సీపీఐ శ్రేణులనుద్దేశించి రేగా పేర్కొనడం గమనార్హం. మన సీట్లు.
మనకే ఉంటాయని మీరెవరూ ఆందోళన పడొద్దని ఆయన తమ పార్టీ కార్యకర్తలకు స్పష్టత ఇచ్చే క్రమంలోనే వామపక్షాల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు కామ్రేడ్స్ కోపానికి కారణమయ్యాయని.. ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. వామపక్షాల్లో కింది స్థాయి కార్యకర్తలు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తును పూర్తిస్థాయిలో జీర్ణించుకోలేక పోతున్నారనేది విశ్లేషకుల అంచనా. దీనిపై వామపక్ష నేతలు కూడా తమ కేడర్ కు బీఆర్ఎస్ పార్టీతో ఎందుకు పొత్తుపెట్టుకునే ఆలోచన చేస్తున్నామనేది వివరిస్తూ కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉన్న తరుణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలు వారికి మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana