Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
బతుకుదెరువు కోసం సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు తెలంగాణ (Telangana) లోని సరిహద్దు మండలాలైన చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం ప్రాంతాలకు బారీగా వలస వస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ (Chattisgarh) ఆదివాసీ పల్లెల్లో ఎటువంటి పనులూ లేకపోవడంతో అక్కడి ఆదివాసీలు తెలంగాణలో ప్రారంభమైన మిర్చి కోత పనులకు వస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఐదు నెలల పాటు కొనసాగే మిర్చి కోత పనుల కోసం ఆదివాసీలు వృద్ధులు, మహిళలు, పిల్లలతో కలిసి వలసొస్తున్నారు. ఇక్కడి పనులతో వచ్చే డబ్బుతో వారికి వర్షాకాలం మొత్తానికి అవసరమయ్యే బియ్యం, నూకలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకుని వెళ్తారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని ఆదివాసీ గ్రామాల్లో పనులు లేకపోవడంతో ఏటా మూడు నుంచి నాలుగు వేల మంది ఆదివాసీలు తెలంగాణాలోని భద్రాచలం (Bhadrachalam) మన్యానికి వలసొస్తున్నారు.
ఈ క్రమంలో ఈ ఏటాది కూడా వలసలు ఆరంభమయ్యాయి. అయితే గతం కంటే ఈ ఏడాది వలస వస్తున్న వారి సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ ప్రస్తుతం ఎటువంటి పనులు లేకపోవడంతోపాటు ఉపాధిహామీ పనులు చేసుకోడానికి బ్యాంకు , పోస్టాఫీసు ఖాతాలు లేవు, ఒకవేళ ఉన్నా ఆయా ఆఫీసులు వారి గ్రామాలకు అందుబాటులో లేకుండా ఉన్నాయి. దీంతో సరిహద్దున ఉన్న మూడు జిల్లాల్లోని అటవీ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలకు వలసలే శరణ్యమయ్యాయి.
అందులో భాగంగా తెలంగాణలో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు. కూలీ పనుల కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి తెలంగాణాలోకి ఆదివాసీలు భారీగా వసలొస్తుండడంతో ఆ రాష్ట్రంలోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల్లోని ఆదివాసీ పల్లెలు ఖాళీ అవుతున్నాయి. గతంలో మావోయిస్టులు, సాల్వాజుడం భయంతో గ్రామాలను ఖాళీ చేస్తూ వచ్చిన ఆదివాసీలు ఇప్పుడు కూలి పనుల కోసం బయటకు వస్తూ గ్రామాలను ఖాళీ చేస్తున్నారు.
ఇళ్ల నుంచి కదలలేని వృద్ధులు తప్పా అక్కడ ఎవరూ లేరు. దీంతో ఆయా గ్రామాలన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. కాగా, వలస వచ్చిన ఛత్తీస్గఢ్ వాసులతో తెలంగాణ సరిహద్దు పల్లెల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. వారి రాకపోకలతో జన సంచారం పెరిగి తెలంగాణలోని పలు గ్రామాలు కళకళలాడుతున్నాయి. ఇదిలా ఉండగా బతుకుదెరువు కోసం భారీగా వలసొస్తున్న ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు దళారీలు వారి శ్రమను దోచుకునేందుకు యత్నిస్తున్నారు.
పనుల కోసం తరలివస్తున్న ఆదివాసీలకు ఎదురేగి సరిహద్దు గ్రామాలకు చేరి.. కూలీ ధర రెండొందలు ఇస్తామని, రెండొందల యాభై ఇస్తామని చెబుతూ పనులకు తీసుకెళ్తున్నారు. వారిని రైతులకు అప్పగించి ఒక్కో మనిషికి రూ.500 నుంచి రూ.600 చొప్పున రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇలా అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దండుకుంటున్న దళారులను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఎంతైనా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Local News, Telangana