Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
మాంసం ఉత్పత్తి వనరులను విస్తరించి, రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం (National Livestock mission) అమలు చేస్తోంది. కేంద్ర పాడి, పశు సంవర్థకాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నాబార్డు (NABARD) సహకారంతో గొర్రెలు, మేకలు, కోళ్లు సహా ఐదు రకాల యూనిట్లు కేటాయిస్తోంది. ఒక్కో యూనిట్ విలువ రూ.కోటి కాగా.. ఇందులో సగం రాయితీ ఉంటుంది. ఏడాది కిందట ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా.. రుణ వ్యయం ఎక్కువగా ఉండటంతో ఆశించిన స్థాయిలో రైతులు ముందుకు రాలేదు. దీంతో పథకం విధి విధానాలను సవరించారు. నూతన మార్గ దర్శకాల ప్రకారం రూ.20లక్షల నుంచి రూ.కోటి వరకు రుణం అందనుంది. గొల్లకురుమల ఆదాయాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల వారికి ఈ రుణం అందించనుంది.
పశుసంవర్ధక శాఖ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను నిర్ణయించనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ పథకంపై ప్రచారం చేయడం, అవగాహన కల్పించడంలో యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తుండటంతో ఈ పథకం గురించి తెలియని దుస్థితి ఉంది. ఇదిలా ఉండగా పాడిపంటలతో పాటు రైతుల ఆదాయం మరింత పెంచేందుకుకేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ క్ మిషన్ పథకాన్ని రూపొందించింది. రూ.కోటి రుణంలో 50 శాతం రాయితీ కింద రూ.50లక్షలు, రూ.40లక్షలు బ్యాంకు రుణం కాగా రూ.10లక్షలు లబ్దిదారు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో దరఖాస్తు చేసుకుంటే 500 ఆడ, 25 మగ జాతి గొర్రెలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కొత్తగా షెడ్డు నిర్మించుకోవడం, దాణా కోసం గడ్డి పెంపకం చేసుకోవాలి. వ్యక్తిగతంగా, సంఘం సభ్యులుగా కూడా రుణం పొందొచ్చు. అయితే గతేడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 40 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా.. ఎనిమిది మందిని అర్హులుగా గుర్తించారు. వారిలో ఐదుగురికి కేంద్రప్రభుత్వం రుణాలు మంజూరు చేయగా.. ఇద్దరికి మాత్రమే సబ్సిడీ వర్తించింది. మిగిలిన వారికి కూడా పలు దఫాల్లో రాయితీ అందనుంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు రూ. కోటి రుణం మంజూరు చేసేవారు. అయితే అది పెద్ద మొత్తం కావడంతో లబ్ధిదారులు సమకూర్చుకోలేరని, బ్యాంకులు కూడా రుణం ఇవ్వలేవన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఔత్సాహికులకు రుణం మంజూరు చేసేందుకు ఇటీవల నిబంధనలు సరళతరం చేశారు. ఐదు విభాగాలుగా యూనిటను విభజించారు.
105 గొర్రెలకు రూ.12లక్షలు, 210 గొర్రెలకు రూ.40 లక్షలు, 315 గొర్రెలకు రూ.60 లక్షలు, 420 తీసుకుంటే రూ.80 లక్షలు, 525 గొర్రెలకు రూ.కోటి రుణాన్ని అందించనున్నారు. అంతేకాకుండా మాంసం ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని సామాజికవర్గాల వారు అర్హులే. యూనిట్ స్థాపనకు సరిపడా సొంత స్థలం కలిగి ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఎంత మందైనా యూనిట్లు పొందవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులను పశుసంవర్ధకశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. రుణం ఇచ్చేందుకు బ్యాంకర్ల అనుమతి తప్పనిసరి. ఐదు విభాగాల్లో దేనికైనా దరఖాస్తు చేసుకుని రుణం తీసుకోవచ్చు. బ్యాంకర్లు తీసుకునే నిర్ణయం, చెప్పే నిబంధనల మేరకు తిరిగి చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అయితే ఈ పథకం గురించి అవగాహన కల్పించేవారు లేకపోవడంతో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Central Government, Local News, Telangana