(D Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)
తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి జరిగిన 2014, 2018 ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో టిఆర్ఎస్ (TRS) పార్టీ ఆశించిన స్థాయిలో శాసనసభ స్థానాలను సాధించుకోలేకపోయింది. ఒక రకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్-4 (ఇల్లందు నియోజకవర్గ నుంచి భానోత్ హరిప్రియ, కొత్తగూడెం నియోజవర్గం నుంచి వనమా వెంకటేశ్వరరావు, పినపాక నియోజకవర్గం నుంచి రేగా కాంతారావు, భద్రాచలం నియోజకవర్గం నుంచి పోదెం వీరయ్య), టిడిపి-1 (అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి మెచ్చా నాగేశ్వరావు) గెలుపొందగా అధికార టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. అనంతరం జరిగిన పరిణామాలలో గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీలో చేరినప్పటికీ ఎన్నికల్లో మాత్రం టిఆర్ఎస్ పార్టీ ఓటమి చవిచూసిందనే చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే టీఆర్ఎస్ శ్రేణులు ఈసారి ఎలాగైనా జిల్లాలో గులాబీ జెండా ఎగరేయాలనే ఊపుతో ఉన్నారు. అయితే వారు కన్నకలలు నెరవేరేలా, ఆశలు ఫలించేలా కనిపించడంలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించి తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అందివచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొనేందుకు సిద్దం అయింది. అందుకే ఈసారి కమ్యూనిస్టులతో పొత్తుకు గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అందులో భాగంగానే రాష్ట్రంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్న చోట్ల సీట్లు ఆ పార్టీ వారికే వదిలేసేందుకు కేసీఆర్ (KCR) సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు ఫలిస్తే కమ్యూనిస్టుల కంచుకోటలుగా చెప్పుకొనే భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు సీట్లు వారికి కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కమ్యూనిస్టులతో పొత్తు అనగానే కొత్తగూడెం జిల్లా గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. ఈసారి కారు గుర్తుకు ఓటేసే చాన్స్ ఉండదేమో అనే ఆందోళన చెందుతున్నారు.
అంతేకాక కమ్యూనిస్టులకు సీట్లు కేటాయిస్తారనే వార్తలను సైతం టీఆర్ఎస్ నేతలు కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. సీపీఐతో పొత్తు వలన కొత్తగూడెం సిట్టింగ్ సీటుకు ఎసరు తప్పేలాలేదు. అలాగే సీపీఎంతో పొత్తు కుదిరితే ఈసారి గెలిచి తీరుతామనుకుంటున్న భద్రాచలం సీటు కూడా వదలుకోవాల్సి వస్తుంది. అంతేకాక ఇల్లందు నియోజకవర్గం కూడా కమ్యూనిస్టులకు కంచుకోటేగానే చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా ఓవైపు బీజేపీ(BJP)దూకుడు, మరోవైపు టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నట్లు అందుతున్న సర్వేలనుబట్టి... కమ్యూనిస్టులతో టీఆర్ఎస్‌కు పొత్తు అనివార్యమని తెలుస్తోంది. దానిని బట్టే పినపాక సీటు కూడా కావాలని కామ్రేడ్లు అడుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతా రావుని కాదని ఆ సీటు కామ్రేడ్లకు ఇవ్వడానికి గులాబీ బాస్ అంగీకరించకపోవచ్చు. కనుక కమ్యూనిస్టులతో పొత్తు కుదిరితే మాత్రం ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం సీట్లు టీఆర్ఎస్ పార్టీ త్యాగం చేయక తప్పదనే వార్తలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Maoists: మళ్లీ మావోల అలజడి.. లాస్ట్ మినిట్‌లో KCR పర్యటనలో మార్పులు అందుకేనా?
అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నిత్యం విభేదించుకునే రెండు ఎర్రజెండా పార్టీల వారు ఒకరి కోసం మరొకరు కలిసికట్టుగా పనిచేస్తారా? గులాబీ క్యాడర్ ఎర్రజెండా పార్టీలకు మనస్పూర్తిగా ఓట్లు వేస్తారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్ర గులాబీలు వికసిస్తాయా? అనేది వేచిచూడాల్సిందే.
ఎందుకంటే టీఆర్ఎస్ క్యాడర్‌కు కమ్యూనిస్టులతో పొత్తు ఏమాత్రం ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఎర్ర పార్టీలు సైతం గడిచిన ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఓటు బ్యాంకును సాధించలేకపోయాయి. అందుకే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం అవసరమా అనే అభిప్రాయం టీఆర్ఎస్ దిగువ శ్రేణిలో వ్యక్తమౌతున్నట్లు జిల్లా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadrari kothagudem, CPI, CPM, Khammam, Local News, Trs