వరి పంట నుంచి మాత్రమే బియ్యం వస్తాయని మనకు తెలుసు. కానీ వెదురు చెట్ల నుంచి కూడా బియ్యం (Bamboo Rice) తీస్తారని తెలుసా? ఈ విషయం చాలా మందికి తెలియదు. సాధారణ వరి మాదిరిగానే వెదురు చెట్లకు పూతపడుతుంది. ఆ తర్వాత కంకులు పడతాయి. ఐతే వెదురు మొక్క సాధారణంగా పూయదు. కొన్ని వెదురు జాతులు మాత్రం 50 సంవత్సరాలకు ఒకసారి పూతదశకు వస్తాయి. పూతపూశాక వెదురు బియ్యం కంకులు వచ్చాయంటే.. అది చనిపోయే సమయం ఆసన్నమైనట్లే..! అంటే జీవితకాలంలో వెదురు చెట్లు ఒకే ఒక్కసారి పూస్తాయి.
అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు (Tribal People) వెదురు బియ్యాన్ని సేకరించి చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. వెదురు బియ్యం రుచికరమైన, బలవర్ధక ఆహారం. తియ్యగా ఉంటాయి. వరి బియ్యం, గోధుమ కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. అందుకే గిరిజనులు వాటిని భద్రపరచుకొని..అవసరమైనప్పుడు వండుకొని తింటారు. కొందరైతే అధిక ధరకు అమ్ముకొని ఆదాయ వనరుగానూ మార్చుకుంటున్నారు. అడవుల్లో అరుదుగా దొరకడం..అందులోనూ ఎక్కువ పోషక విలువలు కలిగి ఉండడంతో.. ఈ బియ్యంపై చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అందుకే వెదురు బియ్యానికి మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది. కిలో బియ్యం ధర రూ.500పైనే ఉంది. అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో వెదురు బియ్యం లభిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ.. డయాలసిస్ సేవలు మరింత చేరువ
వెదురు బియ్యంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ బియ్యంతో చేసిన అన్నం తింటే.. రక్తంలో కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది. ఇందులో విటమిన్ బీ6 సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలతో పాటు డయాబెటిక్, బీపీని నియంత్రించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. సాధారణ వరి బియ్యం, గోధుమ కంటే ఇందులో ప్రొటీన్లు, పీచు ఎక్కువ. ఈ బియ్యం తింటే సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పిత్త, కఫ దోషాలతో పాటు శరీరంలోని ట్యాక్సీన్లు బయటకు తొలగిపోతాయి. కీళ్లు, వెన్ను నొప్పి సమస్యలు తగ్గుతాయి.
తమిళనాడు , మధ్యప్రదేశ్ , మంగళూరు, కేరళలో వయనాడ్ సహా కొన్ని ప్రాంతాల్లో గిరిపుత్రులు వెదురు బియ్యాన్ని సేకరిస్తూ ఆదాయాన్నిపొందుతున్నారు. బడా వ్యాపార సంస్థలు, కంపెనీలు సైతం అడవుల్లోని వెదురు బియ్యాన్ని ఆదివాసీల ద్వారా సేకరిస్తున్నాయి. వాటిని చక్కగా ప్యాక్ చేసి సూపర్ మార్కెట్‌లలో అమ్ముతున్నారు. లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. మీరు కూడా వెదురు బియ్యం వ్యాపారం చేయొచ్చు. ఐతే అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులతో మాట్లాడుకొని.. వారి నుంచి కిలోకు 100 నుంచి 150 చొప్పున బియ్యాన్ని సేకరించవచ్చు. దానిని ప్రాసెసింగ్ చేసి సూపర్ మార్కెట్లు, ఈ కామర్స్ సైట్లలో విక్రయించవచ్చు. తద్వారా అధిక ఆదాయం పొందవచ్చు.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Business, Farmers, Local News, Telangana