రిపోర్టర్ : దాసరి క్రాంతి
లొకేషన్ : భద్రాచలం
సాక్షాత్ శ్రీమన్నారాయణడే రామునిగా భూమిపై అవతరించిన దివ్య క్షేత్రం భద్రాచల క్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ప్రస్తుతం బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నేటి నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అలాగే ఈనెల 31 వరకు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక ప్రయుక్త ద్వాదశ కుండాత్మక చతుర్వేద హవనం, శ్రీరామ యణ మహాక్రతువు నిర్వహించనున్నారు. 30, 31 తేదీల్లో శ్రీసీతారాముల కల్యాణం, పుష్కర సామ్రా జ్య పట్టాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది పుష్కర పట్టాభిషేకం సందర్భంగా యాగశాలలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ఇదిలా ఉండగా శోభకృత్ నామ సంవత్సరాది (ఉగాది)ని పురస్కరించుకుని గర్భాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు అత్భయంత క్తిశ్రద్ధలతో నిర్వహించారు అర్చక స్వాములు. వేప పూత పచ్చడిని నివేదన చేసి భక్తులకు అందజేశారు. అంతే కాకుండా ఉదయం 7 గంటలకు మూలవరులకు ప్రత్యేక అభిషేకం (తిరుమంజనం) నిర్వహించారు. ప్రతీ ఆదివారం మాత్రమే జరిగే ఈ అభిషేకం ఏడాదిలో ఐదు ప్రత్యేక రోజుల్లోనూ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, శ్రీరామనవమి, వైశాఖ పునర్వసు, నరక చతుర్దశి, వైకుంఠ ఏకాదశి రోజుల్లో ప్రత్యేకంగా అలకరించి అభిషేకం చేస్తుంటారు. ఇదిలా ఉండగా దేవస్థానంలోని బేడ మండలంలో ఆస్థాన పురోహితులచే పంచాంగ శ్రవణం నిర్వహించారు.
ఇదిలా ఉండగాశ్రీ రామాయణ క్రతువుకు శ్రీకారం చుట్టి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించారు. అంకురార్పణ అనంతరం 29వ తేదీ వరకు యాగశాలలో, ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. 23 నుంచి 29వ తేదీ వరకు ఉదయం 7 గంటలకు తిరువారాధన, సేవాకాలం, తీర్థ ఘోష్ఠి, 8.30 గంటలకు రామాయణ మహాక్రతువులో భాగంగా చుతుర్వేద, రామాయణ, రామషడాక్షరీ, నారాయణ అష్టాక్షరీ మంత్ర హోమాలు, 11 గంటలకు సం క్షేప రామాయణ సామూహిక పారాయణం, 11.30 గంటలకు నిత్య పూర్ణాహుతి, ప్రసాద వినియోగం, సాయంత్రం 5.30 గంటలకు శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర సామూహిక పారాయణం, 6 గంటలకు రామాయణ మహా క్రతువు హోమాలు, 7గం టలకు వేదిక వద్ద రామాయణ ప్రవచనం, రాత్రి 8 గంటలకు నిత్య పూర్ణాహుతి, ప్రసాద వియోగం తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నేటి నుంచి (మార్చి 22)నుంచి ఏప్రిల్ 5 వరకు స్వామివారి నిత్యకల్యాణ వేడుకను, ఈనెల 26 నుంచి ఏప్రిల్ 5 వరకు దర్బారు సేవలను రద్దు చేశారు. 26 నుంచి ఏప్రిల్ 11 వరకు పవళింపు సేవలను కూడా నిలిపివేయనున్నారు. ఈనెల 30న శ్రీరామ పునర్వసు దీక్ష, ఏప్రిల్ 12న నూతన పర్యంకోత్సవం, ఏప్రిల్ 27న శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ, ఏప్రిల్ 28న పట్టాభిషేకం జరగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri, Local News