Kranthi Kumar, News 18, Bhadradri
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ముక్కోటి కొలహలం మొదలైంది. డిసెంబర్ 23 నుంచి జనవరి 12 వరకు జరగనున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో ముఖ్యగట్టమైన ఉత్తర ద్వార దర్శనం టికెట్లను అధికారులు భక్తులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటు చేశారు. జనవరి 2న నిర్వహించనున్న ఉత్తరద్వార దర్శన వేడుకకు సంబంధించి ప్రవేశ టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆన్లై న్లో భద్రాచలం వెబ్సైట్ ద్వారా ఈ అమ్మకాలు నిర్వహించనున్నట్టు ఈవో బి.శివాజీ తెలిపారు. రూ.2వేలు, రూ.1000, రూ.500, రూ.250 విలువ గల సెక్టారు టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని,www.bhadrachalamonline.com అనే వెబ్సైట్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చని సూచించారు.
అలాగే భక్తుల సౌకర్యార్థం భద్రాద్రి జిల్లాలోని ఐదు కౌంటర్ల ద్వారా ఉత్తరద్వార దర్శన టికెట్ల విక్రయించనున్నట్టు వెల్లడించారు. కొత్తగూడెం, భద్రాచలం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లో ఒక్కొక్క కౌంటరు చొప్పున, రామాలయంలో ప్రధాన టికెట్ కౌంటర్లో, తానీషా కల్యాణ మండపంలోని కేంద్రీయ విచారణ కార్యాలయంలో, భద్రాచలంలోని గోదావరి బ్రిడ్జి పాయింట్ వద్ద, సీఆర్వోలో టికెట్లను నేరుగా కొనుగోలు చేయవచ్చని సూచించారు.
భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇందుకోసం భద్రాద్రి దేవస్థానంలోని ఐదుగురు సిబ్బందిని ప్రత్యేకంగా టికెట్ల అమ్మకాల కోసం నియమించినట్టు తెలిపారు. సంబంధిత సిబ్బంది వెంటనే ఈ బాధ్యతల్లో చేరి టికెట్ల విక్రయాల అనంతరం ఆ మొత్తాన్ని చలాన్ ద్వారా ప్రత్యేక రిజిష్టర్లో నమోదు చేసి దేవస్థానం కార్యాలయంలో జమ చేయాలని ఆదేశించారు.
టికెట్ల విక్రయాల మొత్తాన్ని ప్రతిరోజు సంబంధిత సిబ్బంది కార్యాలయాల్లో జమ చేసిన అనంతరం ఆ సమాచారాన్ని తనకు అందించాలని సిబ్బందిని ఈవో ఆదేశించారు. ఇదిలా ఉండగా టికెట్లను 24 రోజులు ముందులే భక్తులకు అందుబాటులో ఉంచడంతో భక్తులు టికెట్లు పెద్ద ఎత్తున కొలుగోలుచేసే అవకాశం ఉందని దేవస్థానం వర్గాలు ఆశా భాగంగా వ్యక్తం చేస్తున్నాయి.
కానీ ఉత్సవాలు జరిగే సమయంలో టికెట్లు కొన్న భక్తుల కంటే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు, వారి కుటుంబ సభ్యులు సెక్టార్లలో ఆక్రమించుకుంటారని విమర్శ ప్రధానంగా ఉంది. అంతేకాకుండా ఉత్సవాల సమయంలో దేవస్థానం అధికారులు విఐపిఐపి సేవలకు మాత్రమే పరిమితవుతారని.. సామాన్య భక్తులకు అందుబాటులో ఉండరని విమర్శ కూడా ప్రధానంగా వ్యక్తమవుతుంది.
ముక్కోటి, శ్రీరామ నవమి సందర్భాలలో జరిగిన అనుభవాలను భక్తులు నెమరు వేసుకుంటున్నారు. గతంలో టికెట్లు కూడా 30, 40 శాతానికి మించి భక్తులు కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. కోవిడ్ ఇతర కారణాలవల్ల గత రెండు మూడు సంవత్సరాలుగా ఏకాంతంగా, కొద్దిమంది భక్తుల మధ్య జరిగిన ముక్కోటి ఉత్సవాలు ఏడాది అత్యంత ఘనంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు సిద్ధమవుతున్న వేళ ఈ విమర్శలు ఒక్కింత కలవరానికి గురిచేస్తున్నాయి.
ఉత్సవాల జరిగే సమయంలో ప్రముఖుల తాకిడి సర్వసాధారమైనప్పటికీ అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించడంలో దేవస్థానం అధికారులు పూర్తిస్థాయిలో విఫలమవుతున్నారని వాదనలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో రాబోయే ముక్కోటి ఉత్సవాలలో దేవస్థానం అధికారులు ఏ మేరకు భక్తులతో మమేకమవుతారో వేచి చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana