Kranthi Kumar, News 18, Bhadradri
వైద్యుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో చోటుచేసుకుంది. తిరుమలకుంటకు చెందిన లింగాల చక్రధర్ (40)ని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా గొంతుకోసి, ఛాతి భాగంలో కత్తితో పొడిచి హత్య చేశారు. మృతదేహాన్ని వినాయకపురం సమీపంలోని మామిడి తోటలో పడవేశారు. ఉదయం పొలం పనులకు వెళ్లిన కూలీలు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అశ్వారావుపేట ఎస్సై రాజేశ్ కుమార్ విచారణ చేపట్టి తిరుమలకుంటకు చెందిన ఆర్ ఎంపీ వైద్యుడు లింగాల చక్రధర్ మృతదేహంగా గుర్తించి కుటుంబీకులకు సమాచారమిచ్చారు.
చక్రధర్ గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై సమీప గ్రామంలో వైద్యం చేసేందుకు వెళ్తున్నట్టు పొలం పనులకు వెళ్లిన భార్య జయలక్ష్మికి ఫోన్లో తెలిపి వెళ్లారు. రాత్రయినా భర్త తిరిగి రాకపోవటంతో జయలక్ష్మి ఫోన్ చేయగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ ఎత్తి డాక్టర్ గారు మందుల కోసం భద్రాచలం వెళ్లాడని, ఫోన్ ను తమ వద్ద ఛార్జింగ్ పెట్టాడని చెప్పాడు. శుక్రవారం ఉదయం చక్రధర్ కుమార్తె ప్రభావతి వాట్సప్ లో 'కాల్ చేయండి నాన్న' అని మెసేజ్ పంపటంతో దాన్ని చూసినట్లు బ్లూటిక్ వచ్చింది. దీంతో కుమార్తె ఫోన్ చేయగా.. అవతల వ్యక్తి ఛార్జింగ్ పెట్టి వెళ్లారంటూ చెప్పడంతో 'ఫోన్ లాక్ మీకెలా తెలుసు' అని ప్రశ్నించడంతో వెంటనే ఫోన్ పెట్టేసి ఆ తర్వాత స్విచ్చాఫ్ చేశారని కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుతుంది.
ఇదిలా ఉండగా మృతదేహాన్ని ఇన్ఛార్జ్ సీఐ (పాల్వంచ) నాగరాజు పరిశీలించి పోలీసు జాగిలం, క్లూస్ టీంలను రప్పించి ఆధారాలు సేకరించారు. జాగిలం ఆసుపాక సమీపంలో మామిళ్లవారిగూడెం దారిలో ఉన్న చెరువు వద్దు వెళ్లి నిలిచిపోయింది. దుండగులు ఈ ప్రాంతంలో తిరిగినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టంకు అశ్వారావుపేట వైద్యశాలకు తరలించారు.
మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. హత్యకు కారణాలపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పుకుంటున్నారు. చక్రధర్ కు కోడి పందాలు, పేకాట ఆడే అలవాటు ఉందని బంధువులు, గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ ఏదైనా ఘర్షణ జరిగి హత్యకు దారి తీసిందా? లేదా మరే ఇతర కారణాలున్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం ఉన్న ప్రదేశంలోనే హత్య చేశారా..? మరెక్కడైనా హత్య చేసి ఇక్కడకు తెచ్చి పడేశారా..? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతుని ద్విచక్రవాహనం, మెడికట్ కిట్టు ఉన్న బ్యాగు, సెల్ ఫోన్ కోసమూ గాలిస్తున్నారు. త్వరలోనే హంతకులను పట్టుకుంటామని పోలిసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Crime news, Local News, Telangana