(Kranthi Kumar, News 18, Bhadradri)
భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలోనూతన పూజలను ప్రవేశపెట్టేందుకు దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. కొత్తగా అమలు చేయనున్న వీటిపై అభ్యంతరాలు, సలహాలు వారంలోగా ఆలయ కార్యాలయంలో రాత పూర్వకంగా అందించాలని దేవస్థానం ఈవో శివాజీఓ ప్రకటన విడుదల చేశారు. వెలువడిన అభ్యంతరాలను సాధ్యమైనంత త్వరగా నివృత్తి చేసి నూతన పూజా కార్యక్రమాలను అమలుపరిచేందుకు, సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నూతన పూజా విధానం వలన ఆదాయ వనరులు సమకూరడంతో పాటు దేవస్థానంలో స్వామి వారిని భక్తులు ఎక్కువసేపు దర్శించుకునే అవకాశం, సేవ చేసుకునే భాగ్యం లభిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నూతనంగా ప్రారంభించబోయే సేవలు వాటికి సంబంధించిన రుసుము వివరాలు వెల్లడించారు.
నిత్య సర్వ కైంకర్య సేవ టిక్కెట్ ధర రూ. 5 వేలు...
ఈ సేవను ప్రతిరోజూ ఉండే ఉదయాస్తమాన సేవ. ఈ పూజ చేయించాలనుకున్న రోజు జరిగే అన్ని పూజల్లో దంపతులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనవచ్చు. సుప్రభాతం, అభిషేకం, అంతరాలయ అర్చన, శ్రీలక్ష్మీతాయారు అమ్మవారి ఆర్చన, శ్రీఆంజనేయస్వామి వారి అర్చన, నిత్య కల్యాణం, సచిత్ర రామాయణ పుస్తకం, దర్బారు సేవ, పవళింపు సేవలో పాల్గొనవచ్చు. ఈ టికెట్ పొందిన భక్తులకు దేవస్థానం తరుపున ముత్యాల తలంబ్రాలప్యాకెట్ ను అందిస్తారు. అంతేకాకుండా ఐదుగురికి ఉచిత అన్నదానం వర్తిస్తుంది. అయితే ఆదివారం నిర్వహించే అభిషేకానికి విశేష ఆదరణ ఉండడంతో ఆ రోజు మాత్రం నిత్య సర్వ కైంకర్య సేవకు 10 టిక్కెట్లను మాత్రమే కేటాయించనున్నారు. ఈ పూజను ఆదివారం చేయించుకునే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది రామాలయానికి భారం కాకుండా చూడాలి.
నిత్య పుష్పాలంకరణ సేవ టికెట్ ధర రూ.5 వేలు.
ఈ సేవ దేవస్థానంలో సోమవారం నుంచి శనివారం వరకు ఉంటుంది. భక్తులు పూజ చేయించాలనుకున్న రోజున ప్రధాన ఆలయంలో మూల విరాట్ తో పాటు అనుబంధం కోవెళ్లలోని దేవుళ్లకు పూల దండలను సమర్పిస్తారు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం తరపున కండువా, జాకెట్ క్లాత్, 100 గ్రాముల బరువు గల రెండు లడ్డూలు, ఒకరికి లేదా దంపతులకు అంతరాలయ అర్చన, నలుగురికి ఉచిత అన్నదానం కల్పించనున్నారు.
శ్రీరామనవమి ముత్యాల సమర్పణ టికెట్ ధర రూ. 10 వేలు...
శ్రీరామ నవమి కల్యాణ మహోత్సవం రోజు అందుబాటులో ఉండనున్న ఈ సేవ ద్వారా భక్తులకు టిక్కెట్ (ఉభయం), 108 ముత్యాలుగల తలంబ్రాలు ఉన్న ప్యాకెట్ ను అందించడంతో పాటు ఉభయ దాతకు కల్పించే అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు తెలుస్తుంది.
వేద ఆశీర్వచనం టిక్కెట్ ధర రూ.500.
స్వామివారి దర్శనం తర్వాత బేడా మండపంలో దంపతులు లేదా ఒక్కరికి అవకాశం ఉంది. ఈ సేవ ద్వారా భక్తులకు వేద పండితుల ద్వారా వేద ఆశీర్వచనం ఇప్పించడం జరుగుతుంది. ఉదయం 9. 30, 10,00, 10:30, 11,00 గంటలకు ఉంటుంది. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం తరపున కండువా, జాకెట్ ముక్క, 100 గ్రాముల బరువు గల రెండు లడ్డూలను ఉచితంగా అందిస్తారు.
తులసి దండ అలంకరణ టికెట్ ధర రూ. 1,000.
ప్రతి శనివారం ఉదయం 7 గంటలకు, ఒకరు లేదా దంపతులు పాల్గొనేందుకు అవకాశం ఉన్న ఈ సేవలో టికెట్ తీసుకున్న భక్తులు ఉభయ దాత శిరస్సుపై తులసి దండ ఉంచి ఆలయ ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత భక్తుల సమక్షంలో అంతరాలయంలో స్వామి వారికి దండను అలంకరిస్తారు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం తరపున కండువా, జాకెట్ వస్త్రం. 100 గ్రాముల బరువు గల రెండు లడ్డులు, రామ కోటి పుస్తకాన్నిఉచితంగా అందిస్తారు.
తులాభారం టిక్కెట్ ధర రూ.100.
ప్రతిరోజూ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి.. 8 వరకు ఈ సేవలో పాల్గొనేందుకు భక్తులకు అవకాశం ఉంటుంది. ఇందులో భక్తులు తమ బరువుకు తగిన మొక్కును రాములవారికి సమర్పించుకోవచ్చు. బెల్లం, కంది పప్పు, పుష్పాలు, పంచదార, వాహనాలు, డబ్బులు ఇలా ఏదైనా మొక్కును తులాభారం రూపంలో చెల్లించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
అభ్యంతరాలుంటే తెలపాలి
ప్రతిపాదిత పూజలపై భక్తులు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను లిఖితపూర్వకంగా 7 రోజుల్లోగా దేవస్థాన కార్యాలయంలో అందచేయాలని ఈఓ శివాజీప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలు రాకపోతే వారం రోజుల అనంతరం ఈ సేవల అమలుపై నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana