(Kranthi Kumar, News 18, Bhadradri)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామి వారికి కృత్తికా దీపోత్సవం కార్యక్రమాన్ని అత్యంత కమనీయంగా నిర్వహించారు. తొలుత తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాన్ని పురస్కంచుకొని స్వామివారి ఉత్సవమూర్తులను, ఆళ్వార్ ను పల్లకీలో ఊరేగింపుగా ప్రధాన ఆలయం ప్రాంగణంలోనిబేడా మండపంలోకి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వార్లకు 25 కలశాలతో స్నపన తిరుమంజనం, పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత హారతి సమర్పించారు. ఇదిలా ఉండగా కృత్తికా దీపోత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం హోమం నుంచి తెచ్చిన జ్వాలలతో దీపాలను వెలిగించారు. చొక్కొసుర దహనం, తిరువీధి సేవ సంప్రదాయబద్ధంగా జరిపారు.
ప్రతి ఏటా మార్గశిర పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకొని కృత్తికా దీపోత్సవం నిర్వహించటం ఆనవాయితీగా వస్తున్న అంశం. కృత్తిక దీపోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బేడ మండపం ఆవరణలో జరిగే స్వామివారి నిత్య కళ్యాణాన్ని నిలిపివేశారు. నేటి నుంచి యధావిధిగా స్వామి వారి నిత్య కళ్యాణం జరగనున్నట్లు ఆలయ వర్గాలు తెలియజేశాయి. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎఎస్పీ రోహిత్ రాజ్ కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ఆవరణంలో దీపాలను వెలిగించారు. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకి సంబంధించిన కార్యక్రమాలు సైతం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్న తరుణంలో దేవస్థానం పరిధిలో నూతన పూజలు సైతం అమల్లోకి తెచ్చేందుకుదేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
కొత్తగా అమలు చేయనున్న వీటిపై అభ్యంతరాలు, సలహాలు వారం లోగా ఆలయ కార్యాలయంలో రాత పూర్వకంగా అందించాలని దేవస్థానం ఈవో శివాజీ ఓ ప్రకటన విడుదల చేశారు. వెలువడిన అభ్యంతరాలను సాధ్యమైనంత త్వరగా నివృత్తి చేసి నూతన పూజా కార్యక్రమాలను అమలుపరిచేందుకు సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నూతన పూజా విధానం వలన ఆదాయ వనరులు సమకూరడంతోపాటు దేవస్థానంలో స్వామి వారిని భక్తులు ఎక్కువసేపు దర్శించుకునే అవకాశం, సేవ చేసుకునే భాగ్యం లభిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ నేపద్యంలో నూతనంగా ప్రారంభించబోయే సేవలు వాటికి సంబంధించిన రుసుము వివరాలు వెల్లడించారు. ప్రతిపాదిత పూజలపై భక్తులు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను లిఖితపూర్వకం గా 7 రోజుల్లోగా దేవస్థాన కార్యాలయంలో అందచేయాలని ఈఓ శివాజీ ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలు రాకపోతే వారం రోజుల అనంతరం ఈ సేవల అమలుపై నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrari kothagudem, Local News, Telangana