Kranthi Kumar, News 18, Bhadradri
పౌరులు దేశంలో ఎక్కడైనా జీవించవచ్చని రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ ఓ గ్రామం నుంచి గుత్తి కోయలను బహిష్కరించాలని తీర్మానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఇటివలే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్ గఢ్ నుంచి వలసవచ్చిన 40 కుటుంబాలకు చెందిన సుమారు 200 మంది గుత్తికోయలు బెండాలపాటు గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో సుమారు రెండు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం కొన్నేళ్ల కిత్రం ఓటు హక్కు, ఆధార్ కార్డులు ఇచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం బెండాలపాడు గ్రామపరిధిలో అటవీ రేంజర్ శ్రీనివాసరావు హత్యకు గురికావడంతో ఆ గ్రామ పరిధిలో ఉండే గుత్తికోయలే ఈ హత్య చేశారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో తమకు గుత్తికోయలనుంచి ప్రాణ హాని ఉందని, వారిని గ్రామం నుంచి బహిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామకార్యదర్శి సమక్షంలో బెండాలపాడు ప్రజలు గ్రామసభ నిర్వహించి తీర్మానం చేశారు. ప్రభుత్వం వెంటనే వారిని ఛత్తీస్గఢ్ కు తిరిగి పంపించాలని ఆ గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. బహిష్కరణ తీర్మాన పత్రంపై ఆ గ్రామ సర్పంచ్ కూసం వెంకటేశ్వర్లుతో పాటు గ్రామ కార్యదర్శి సతీష్ సంతకాలు చేశారు.
అయితే ఈ చర్యలను పలువురు తప్పు పడుతున్నారు. ఎవరైనా తప్పుచేస్తే వారిని చట్ట ప్రకారం శిక్షించాలనే తప్ప ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఇటువంటి చర్యలకు పూనుకోవటం సరికాదని పేర్కొంటున్నారు. ఈ చర్యలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై చండ్రుగొండ మండల స్థాయి అధికారులు ఓ సందర్భంగా మాట్లాడుతూ గుత్తికోయలపై బహిష్కరణ చర్యలకు పాల్పడవారిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఇదిలా ఉండగా గుత్తి కోయలకు అటవీ ప్రాంతంలో నివసించే హక్కు లేదని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లాలని భద్రాద్రి కొత్తగూడెం అటవీ శాఖ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. శనివారం అటవీ సిబ్బంది ఎర్రబోరు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అనంతరం గుత్తి కోయలకు నోటీసులు అందజేసినట్లు తెలుస్తుంది. వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లిపోవాలని సూచించినట్లు జిల్లా వ్యాప్తంగా వార్త చక్కర్లు కొడుతుంది.
ఇదిలా ఉండగా ఎర్రబోరు అడవి ప్రాంతంలో గుత్తి కోయలు 2016 సంవత్సరం తర్వాత ఇక్కడికి వచ్చారని 2016కు ముందు ఆ తర్వాత ఎర్రబోరు అటవీ ప్రాంతానికి సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాటిలైట్ చిత్రాలను అటవీ అధికారులు ఇటీవలే విడుదల చేశారు. ఏది ఏమైనప్పటికీ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ రావు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా గుత్తి కోయలు మనుగడపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ గుత్తి కోయలు పై ఎటువంటి నిర్ణయం తీసుకోనుందని జిల్లావాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana