Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
భద్ర మహర్షి తపస్సుకు మెచ్చిన సాక్షాత్ శ్రీమన్నారాయణడే రాముడుగా భూమిపై అవతరించిన దివ్య క్షేత్రం భద్రాచల క్షేత్రం (Bhadrachalam Temple). సీతా లక్ష్మణ సమేతంగా ఆ రామచంద్ర స్వామి వారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తున్నారు. దేశంలోనే రెండవ అయోధ్యగా కీర్తి గడిస్తూ నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే రామ క్షేత్రంలో పలువురు అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రామభక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా భద్రాద్రి రామ క్షేత్రంలో నిత్య కైంకర్యాలతో స్వామివారి కళ్యాణంతో పాటు సాయంత్రం సమయంలో జరిగే దర్బార్ సేవ ప్రధానమైనవి. రాజా తూము లక్ష్మీ నరసింహ దాసు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ దర్బారు సేవను ప్రభుత్వోత్సవముగా ఈ దేవస్థానంలో నిర్వహిస్తుంటారు.
ప్రపంచంలో మరే ఇతర దేవస్థానాలలో లేని ఉత్సవమే ఈ ప్రభుత్వోత్సవము. ప్రతిరోజు సాయంత్రం సమయంలో స్వామివారి ఆరాధన అనంతరం నిత్య కళ్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులను ఆశీనులు చేసి వేద పారాయణాన్ని పఠించడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ దర్బార్ ఉత్సవంలో ప్రత్యేకత. హరిదాసుల కీర్తనలు వేద పండితుల వేదమంత్రోచరణ నడుమ అర్చక స్వాములు చేసే ప్రత్యేక పూజలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ముఖ్యంగా దర్బారు సేవలో బహుపరాక్ బహుపరాక్ అంటూ ఆ స్వామివారికి సమర్పించే దివిటీ సలాం (రెండు కాకడాలు ఒకే చోట చేరే సందర్భం) వెలుగులో నుంచి స్వామివారిని దర్శించుకుంటే భక్తుల కోరికలు వెనువెంటనే పలుస్తాయని ఇక్కడికి వచ్చే రామ భక్తుల నమ్మకం.
ఇంతటి విశిష్టత కలిగిన దర్బారు సేవపై భద్రాద్రి దేవస్థాన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి సాకుగా చూపుతూ నిత్యకళ్యాణ మండపంలో భక్తుల మధ్య అత్యంత వైభవంగా జరగాల్సిన ఈ సేవను అంతఃఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సేవ నిర్వహణకు వైదిక సిబ్బంది కొరత, అర్చక స్వాముల కొరత, సాధారణ సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ పలు పలు సందర్భాలలో ఈ సేవను ప్రధాన ఆలయంలో అంతరంగికంగా నిర్వహిస్తున్నారు.
ఇలా ఈ సేవను ఆంతరంగికంగా నిర్వహించడం వల్ల సామాన్య భక్తులు దర్బారు సేవను వీక్షించే భాగ్యాన్ని కోల్పోవడమే కాకుండా దర్బారు సేవ అంతఃఆలయంలో జరిగినంత సేపు అంతరాలయ అర్చన కార్యక్రమాన్ని సైతం అధికారులు నిలుపుదల చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆలయానికి వచ్చే ఆదాయానికి గండి పడుతుందని పలువురు రామభక్తులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనాప్పటికీ ఇకపై అయినా నిత్య కైంకర్యాలు,పూజల విషయాలలో ఆలయ అధికారులు కాస్త శ్రద్ధ వహించి సామాన్య భక్తులకు రాముల వారి సేవలో పాల్గొనే భాగ్యాన్ని కల్పించవలసిందిగా సగటు రామ భక్తులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri, Local News, Telangana