Home /News /telangana /

BHADRADRI KOTHAGUDEM BHADRACHALAM SITARAMA TEMPLE COLLECTS HIGH FEES FROM DEVOTEES IN THE NAME OF ENTRY FEE SNR KMM

Telangana:భద్రాచలం రాములోరి గుడిలో దళారులదే రాజ్యం..ఎంట్రీ, పార్కింగ్‌ ఫీజుల పేరుతో దోపిడీ

(రాములోరి పేరుతో దోపిడీ)

(రాములోరి పేరుతో దోపిడీ)

Telangana:ఎంతో భక్తితో భద్రాచలం సీతారామచంద్రులను దర్శించుకోడానికి వచ్చే భక్తులను పీల్చి పిప్పి చేస్తున్నారు దళారులు. ఎవరికి అందినంత వాళ్లు భక్తుల నుంచి వసూళ్లు చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలను ఎంట్రీ ఫీజుల పేరుతో నాలుగైదు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    (G.SrinivasReddy,News18,Khammam)
    ఎంతో భక్తితో భద్రాచలం(Bhadrachalam)సీతారామచంద్రు(Sitaramalayam)లను దర్శించుకోడానికి వచ్చే భక్తులను పీల్చి పిప్పి చేస్తున్నారు ఇక్కడి దళారులు. ఎవరికి అందినంత వాళ్లు భక్తుల నుంచి వసూళ్లు చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలను ఎంట్రీ ఫీజుల(Entry fees)పేరుతో నాలుగైదు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇంత ఛార్జీ ఏమిటని భక్తులు ప్రశ్నిస్తే ..అయితే వెనక్కి వెళ్లిపోండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. భక్తుల నుంచి నామమాత్రకు పార్కింగ్‌ ఛార్జ్(Parking‌ charge)వసూలు చేయాల్సింది పోయి.. హుకుం జారీ చేస్తున్నారంటూ రాములోరిని చూసేందుకు వచ్చిన భక్తులు వాపోతున్నారు.

    ఐదురెట్లు అధికంగా వసూళ్లు..
    గతంలో వెహికల్ ఎంట్రీ ఫీజు 30 రూపాయల నుంచి 50రూపాయలు ఉండేది. కాని ఇప్పుడు దాన్ని ఐదు రెట్లు పెంచి 150రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికితోడు దేవాలయ ప్రాంగణంలోనూ అనధికారికంగా పార్కింగ్‌ ఫీజు పేరుతో వసూళ్ల పర్వం నడుస్తోంది. ఆర్థికంగా అంత స్తోమత లేనివాళ్లు ఆటోలో వచ్చినప్పటికీ వారిని సైతం రూ.150 ఇవ్వాల్సిందేనంటూ దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాక ఇక్కడిదాకా వచ్చినాక చేసేది లేక భక్తులు మౌనంగా దళారులు అడిగినంత డబ్బులు ఇచ్చుకుంటున్నారు. భక్తుల అవసరాన్ని ఆసరా చేసుకుని దోచుకోవడం ఈ దళారుల వంతుగా మారింది.

    దళారుల నిలువుదోపిడీ..
    ఆలయ ప్రాంగణంలో పర్యవేక్షణ అధికారాలు కలిగిన వాళ్లకు దళారీలు నెలవారీ మామూళ్ల పేరుతో చేతులు తడుపుతూనే ఉన్నారు. భక్తులను దోచుకుంటున్న డబ్బును తిలా పాపం తలా పిరికెడు అనే చందంగా వంతులు వేసుకొని మరీ పంచుకుంటున్నారు. కొన్నిసార్లు పంచాయతీ పేరిట, మరికొన్ని సార్లు దేవాలయం పేరుతో వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టూరిస్టు ప్రాంతాల్లో ఎంట్రీ ఫీజు వసూలు చేసుకునే అధికారం సంబంంధిత గ్రామ పంచాయతీలకు ఉంది. అయితే ఈ వసూళ్లు అనేవి పారదర్శకంగా ఉండాల్సి ఉంది. ఇప్పటికి ఎన్నికైన పాలకవర్గం లేక అక్కడ దాదాపు పదేళ్లు అవుతోంది. అయినప్పటికీ వసూళ్లు చేస్తునే ఉన్నారు. కనీసం వసూలు చేసే రశీదుపైన గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం అయినా ఉండడం లేదు. కేవలం స్టాంప్‌ వేసిన రశీదులే ఇస్తున్నారు.

    అడిగే వారులేక అడ్డగోలు దోపిడీ..
    దీంతో నిజంగా ఇది గ్రామ పంచాయతీ తరపున   చేస్తున్న పన్ను వసూలా.. లేక అనధికారికంగా చేస్తున్న వసూళ్ల పర్వమా అర్థం కాని పరిస్థితి. ఎవరైనా భక్తులు ప్రశ్నించినపుడు స్పందించే విధానం సైతం దారుణంగా ఉంటోందన్న ఆరోపణలున్నాయి. తాము డిమాండ్‌ చేసిన మేర డబ్బులు ఇస్తే సరే లేకపోతే వెనక్కు వెళ్లిపొమ్మని ఆదేశిస్తున్నారంటే ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రంతోని నలుమూల నుంచి వచ్చే వాళ్లే కాదు ఆంధ్రా, ఒడిశా, చత్తీస్‌గడ్ నుంచి భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వేలాది భక్తులు వస్తుంటారు. ఎంట్రీ ఫీజుల పేరుతో దళారులు డబ్బులు వసూలు చేయడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంట్రీ ఫీజులే కాదు ఆలయ ప్రాంగణంలోని హోటళ్లు, టిఫెన్‌ సెంటర్లలో ధరలైతే ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయంటున్నారు భక్తులు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Bhadrachalam, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు