Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (Bhadrachalam Temple) లో ఈ ఏడాది మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో మార్చి 30వ తేదీన సీతారాముల కళ్యాణం, 31వ తేదీన పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమాలు ప్రధాన క్రతువులు. ఈ క్రమంలో 31వ తేదీన జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవానికి నది సముద్ర పుష్కరిణి జలాలను సేకరించే పనిలో వైదిక సిబ్బంది నిమగ్నమయ్యారు.ఇటీవలే దేవస్థానంలో నిర్వహించిన డోలోత్సవం, వసంతోత్సవం సందర్భంగా పుష్కర సామ్రాజ పట్టాభిషేక మహోత్సవానికి నది సముద్ర పుష్కరణీ జలాలను సేకరించేందుకు వైదిక సిబ్బందిని దేశంలోని వివిధ ప్రాంతాలకు వైదిక కమిటీ పెద్దలు పంపారు.
ఈ నేపథ్యంలో సదరు జలాలను స్వీకరించేందుకు వెళ్లిన వైదిక, అర్చక బృందం సభ్యులు మధ్యప్రదేశ్ , చత్తీస్గడ్, మహారాష్ట్ర , కేరళ , తమిళనాడు తదితర రాష్ట్రాలలో నర్మదా చంద్రభాగ, తుంగభద్ర తదితర నదుల తీర్థ జలాలను సేకరించగా మరికొన్ని పవిత్ర నదులలో తీర్థ జలాలను సేకరించి భద్రాద్రికి తిరిగి రానున్నారు. ఏడాది పూర్తి సాంప్రదాయ బద్ధంగా జరగబోయే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించేందుగాను దేశంలో ఉన్న ప్రముఖ నదులు, సముద్రాలు, పుష్కరణీల నుంచి పవిత్ర జలాలను శాస్త్రోక్తంగా సేకరిస్తున్నట్టు వైదిక కమిటీ పెద్దలు న్యూస్ 18కు తెలియజేశారు.
ఇదిలా ఉండగామధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మధ్యలో ఉన్న అమరకంఠక్ నర్మదానది జన్మస్థలంలో సౌమిత్రి శ్రీనివాసాచార్యులు తీర్ధ సేకరణ చేశారు. పశ్చిమదిక్కులోని మహారాష్ట్రలోని చంద్రబాగా నది వద్ద అమరవాది మురళీకృష్ణమాచార్యులు, కలకోట పవనకుమారాచార్యులు, మేల్కొట దివ్యక్షేత్రంలో కల్యాణి పుష్కరిణి తీర్ధాన్ని పొడిచేటి రామభద్రాచార్యులు, పొడిచేటి సీతారామాచార్యులు సేకరించారు. ఇప్పటికే మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో తీర్థ జలాలను సేకరించారు. రాబోయే వారంలో ఇందుకు సంబంధించి పూర్తిగా జలాలను సేకరించి భద్రాద్రికి తరలిరానున్నారు.
ఇదిలా ఉండగా ఇటివలే దేవస్థాన ప్రాంగణంలోని యాగశాలలో సుదర్శన హోమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ముందుగా స్వామి వారిని యాగశాలకు తీసుకొచ్చి వేదికపై ఆసీనులను చేశారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, కంకణధారణ, అగ్ని ప్రతిష్ఠ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇదే క్రమంలో సుదర్శన హోమాన్ని నిర్వహించి తీర్థ ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. ప్రతి నెల చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకొని సుదర్శన హోమాన్ని నిర్వహిస్తుండటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన అర్చకులు అమరవాది విజయ రాఘవన్, అర్చకుల అమరవాది వెంకట్రామన్ పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana