Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటారు. మెడికల్ క్యాంపుల నిర్వహణ మొదలు కుటుంబ పోషణ భారమైన అభాగ్యులకు ఆర్థిక సహాయం చేయడం వరకు పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కాకుండా ఆటపాటలు, కళలు, క్రీడలు తదితర రంగాలను సైతం నిత్యం ప్రోత్సహిస్తూ సంబంధిత వ్యక్తులకు బాసటగా నిలుస్తుంటారు. ఇలాంటి సంఘటనలు తరచూ మనం చూస్తూ ఉంటాం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీసులు మరో అడుగు ముందు వేసి గ్రామీణ క్రీడాకారులు ఉన్న నైపుణ్యాన్ని వెలుకితీసేందుకు క్రీడా పోటీలు నిర్వహించేందుకు పూనుకున్నారు. నవంబర్ 18 నుంచి మండల స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ దుమ్ముగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను విజయవంతం చేద్దాయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐ దోమల రమేష్ న్యూస్ 18 తో మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన దుమ్ముగూడెం మండలంలో ఎందరో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన యువత అన్ని విభాగాల్లో మెరికల్లాంటి ప్రతిభను కనబరుస్తున్నారని, వారందరి అభ్యున్నతి కోసం పోలీస్ శాఖ ప్రతినిత్యం అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు.
నవంబర్ 18 నుంచి జరిగే ఈ వాలీబాల్ టోర్నమెంట్ ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న మైదానంలో ఉదయం గం.9.00ల నుండి ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు టీం పేర్లను 17న ఉదయం గం.11.00ల నాటికి నమోదు చేయించుకోవాలని, జట్ల ఎంపిక చేసి మధ్యాహ్నం గం.12.00లకు డ్రాలు తీసి షెడ్యూల్ ప్రకటించడం జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొని గెలుపొందిన జట్లకు మొదటి, రెండు, మూడవ బహుమతులను అందించడం జరుగుతుందని, మండలంలోని మారుమూల గ్రామాల నుంచి కూడా టీంలు పాల్గొనవచ్చన్నారు. ఒక టీంలో ఆడిన క్రీడాకారుడు మరో టీంలో ఆడరాదన్నారు. మండల వ్యాప్తంగా భారీ స్థాయిలో క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొని ఈ క్రీడా పోటీని విజయవంతం చేయాలని ఆయన మండల యువతకు పిలుపునిచ్చారు.ఈ క్రీడల ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ, ఓఎస్డీ, ఏఎస్పీలు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్ పూర్తి వివరాల కోసం కోసం ఎస్పె రవి - 9502492722, హెడ్ కానిస్టేబుల్ క్రిష్ణ- 9948934310, కానిస్టేబుల్ తిరుపతి - 9700084044లలో సంప్రదించాలని పేర్కొంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana