Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
తన కూతురు భారత మహిళ క్రికెట్ (Indian Women’s Cricket Team) జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నది తండ్రి చిరకాల స్వప్నం. స్వతహాగా పీఈటీగా, ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేస్తున్న జి. రామిరెడ్డి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం (Bhadrachalam) లో తన కూతురికి మూడేళ్ల ప్రాయంలో క్రికెట్ బ్యాట్, బాల్ చేతికిచ్చారు. ఆరంభంలో ప్రతి రోజు ఆరు గంటల పాటు క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంది జి.త్రిష. అనంతరం తన లక్ష్య సాధనలో భాగంగా తండ్రి రామిరెడ్డి తన కూతురికి శాస్త్రీయ శిక్షణ కోసం హైదరాబాద్ (Hyderadab) కు మకాం మార్చారు. నాటి నుంచి ప్రతి రోజు క్రికెట్లో కఠోర శిక్షణతో మెళకువలు నేర్చుకొని దిన దిన ప్రవర్ధమానంగా యువ క్రికెటర్ త్రిష రాణిస్తోంది. తాజాగా అండర్-19 మహిళ క్రికెట్ జట్టులో స్థానం సాధించింది త్రిష.
న్యూజిలాండ్ (Newzealand) తో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 6 వరకు జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరిస్ లో 15మంది సభ్యులతో కూడిన ఇండియా జట్టులో త్రిషను ఎంపిక చేశారు. త్రిష ఎనిమిదేళ్ల వయసులో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలో ప్రతిభ కనబరిచింది. తర్వాత అండర్-16, 12 ఏళ్లకే అండర్-19 క్రికెట్ జట్టుకు ఆడింది. హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టులో 12ఏళ్లకే స్థానం సంపాదించింది.
చిన్న వయసులోనే త్రిష బీసీసీఐ (BCCI) 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు గెలుచుకుంది. ఇదిలా ఉండగా త్రిషది ఏజెన్సీ డివిజన్ కేంద్రమైన భద్రాచలం. ఆమె తండ్రి జి. రామిరెడ్డి పీఈటీగా, ఫిజికల్ ట్రైనరుగా భద్రాచలంలో పని చేసేవారు. భారత మహిళ క్రికెట్ జట్టుకు తన కూతురు ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో ఆయన తొలినుంచి తన కూతురును వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలంలో మూడేళ్ల ప్రాయంలో క్రికెట్ బ్యాట్, బాలుతో ఓనమాలు నేర్చుకుంది. స్థానిక సీనియర్ క్రికెటర్లు బుజ్జి, సుబ్రమణ్యంలు కోచ్ గా వ్యవహరించారు. నాలుగో తరగతి వరకు భద్రాచలంలో త్రిష చదివింది.
ఈ క్రమంలో క్రికెట్ లో పూర్తిస్థాయిలో రాణించాలంటే శాస్త్రీయ శిక్షణ ఎంతో అవసరమని గుర్తించిన ఆమె తండ్రి రామిరెడ్డి హైదరాబాద్ కు మకాం మార్చారు. ఈ క్రమంలో త్రిష హైదరాబాద్ లోని ఈస్టు మారేడుపల్లిలో ఉన్న సెయింట్ జోన్స్ క్రికెట్ అకాడమీలో కోచ్ శ్రీనివాస్ వద్ద శిక్షణ పొందుతోంది. 2012-13 నుంచి ఆయనే త్రిషకు కోచ్ గా వ్యవహరిస్తున్నారు. భద్రాచలంకు చెందిన త్రిష అండర్-16లో రాష్ట్ర జట్టుకు 2012-13లో ఎంపికైంది. అలాగే అండర్-19, అండర్-23లలో ఓపెనింగ్ బ్యాటర్ గా, లెగ్ స్పిన్నర్ గా రాణించి ప్రస్తుతం సీనియర్స్ తో ఆడుతోంది.
తాజాగా ఆమెను 15 మంది జట్టు సభ్యుల్లో ఒకరిగా ఎంపిక చేయడం విశేషం. న్యూజిలాండ్ తో జరగబోయే టీ 20 సిరిస్‌లో స్పిన్నర్‌గా త్రిషను ఎంపిక చేయడం కావడం గమనించదగ్గ విషయం. ఇదిలా ఉండగా భద్రాచలానికి చెందిన త్రిష భారత మహిళ బ్లూ జట్టుకు ఎంపికవడం పట్ల భద్రాద్రికి చెందిన క్రికెటర్లు, అభిమానులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana, Women Cricket