(Kranthi Kumar,News18,Bhadradri)
ఆధ్యాత్మికత, ఆరోగ్య సూత్రాల మేళవింపు అయ్యప్ప దీక్ష. మనసు, శరీరాన్ని పవిత్రం చేసుకొని ఆధ్యాత్మిక చింతనతో తనను తాను మార్చుకు నేందుకు 41 రోజుల దీక్ష ఉంటుంది. హరిహరసుతుడు అయ్యప్ప. 'అయ్య' అంటే విష్ణువు 'అప్ప' అంటే శివుడు అనే పేర్ల సంగమంతో అయ్యప్ప నామం ఆవిర్భవించింది. మహిషి అనే రాక్షసున్ని సంహరించి అయ్యప్ప కేరళ(Kerala)లోని శబరిమల(Sabarimala)లో వెలిశాడు. దక్షిణ భారత దేశంలోని ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రాల్లో శబరిమల అయ్యప్పఆలయం ఒకటి. కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి(Makar Sankranti) వరకు అయ్యప్ప దీక్షల కోలాహలం కనిపిస్తుంది. ఎంతో పవిత్రత, నిష్టతో 41 రోజుల పాటు కఠిన దీక్ష సాగించిన 'స్వాములు' ఇరు ముడి ధరించి శబరిమల అయ్యప్పను దర్శించుకుంటారు. స్వామి దర్శనానికి ముందు 18 మెట్లు ఎక్కాలి. ఈ మెట్లను అధిరోహించడం ద్వారా అవిద్య, అజ్ఞానం తొలగిపోయి స్వామి అనుగ్రహం లభిస్తుందని దీక్షధారుల నమ్మకం.
భక్తితో పాటు ఆరోగ్యం..
మానవ విలువలను పెంపొందించుకునేందుకు అయ్యప్ప దీక్ష దోహదపడుతుంది. మాలధారణ, నల్లని వస్త్రధారణ, చన్నీటి స్నానం, విభూతి, చందనం, కుంకుమతో అలంకరించుకోవటం వంటి ఆచారాలు ఆధ్యాత్మికతకు ఉపకరిస్తాయి. శరీరంపై భస్మధారణ ఈశ్వర సంకేతానికి, నుదుటిపై మెరిసే తిరునామం విష్ణుమూర్తిని గుర్తు చేస్తుంది. అంతే కాకుండా 41 రోజుల దీక్ష ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. భక్తి భావంతో పాటు ఆహార అలవాట్లలో మార్పుల కోసం అనేక మంది ఈ దీక్షలను తీసుకుంటారు. ఉదయాన్నే నిద్ర లేవడం చైతన్యానికి ప్రతీకగా, సూర్యోదయానికి ముందే చన్నీటి సాన్నం నాడీ వ్యవస్థ ఉత్తేజపరచడం, నేలమీద పడుకోవడం ద్వారా వెన్ను నొప్పుల సమస్యలు తగ్గిపోవడం, కండరాల పటిష్టత, రక్త ప్రసరణ, రక్త వ్యవస్థ మెరుగుపడేందుకు దోహదపడుతుంది. నిత్య దీపారాధనతో మనసు తేలిక పడి స్నేహం, ప్రేమానురాగాలు పెరుగుతాయి. పొగ తాగటం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది.
భద్రాద్రి నుంచే 3వేల మందికిపైగా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి ఏటా వేలాది మంది మాల ధరిస్తుంటారు. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోనే సుమారు 3000 మందికి పైగా దీక్ష తీసుకుంటారు. భద్రాచలం పట్టణ ప్రారంభ ప్రాంతంలో శబరిమల దేవస్థానం పోలిన ఆలయాన్ని ఇక్కడ నిర్మించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శబరిమల మాదిరిగానే ఇక్కడ పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. ఇక ఏజెన్సీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పీఠాలను ఏర్పాటు చేసుకొని ఆ పీఠాల కేంద్రంగా అయ్యప్ప పూజలు, నిత్యాన్నదానాలు కొనసాగుతున్నాయి. 41 రోజులు దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు రైళ్లు, బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్ శబరిమల వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.