రిపోర్టర్ : క్రాంతి
లొకేషన్ : భద్రాద్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు నోటిఫికేషన్ జారీ చేయగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు పోటెత్తాయి. నిజానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బడ్జెట్ ప్రాతిపదికన కేవలం 70 యూనిట్లు మంజూరు కాగా అనూహ్యరీతిలో నిరుద్యోగ యువతి, యువకుల నుంచి 3,377 దరఖాస్తులు వచ్చాయి.
దీంతో సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి గడిచిన నాలుగేళ్లుగా మైనారిటీ నిరుద్యోగులకు ప్రభుత్వం రుణాలు ఇవ్వడం లేదు. దీంతో నోటిఫికేషన్ రాగానే అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. గత డిసెంబర్ 17 తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియసాగింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 70 యూనిట్లు మంజూరు కాగా అందులో రూ. 1లక్ష యూనిట్లు 49, రూ.2లక్షల యూనిట్లు 21 ఉన్నాయి. ఇందుకు 3,377 మంది దరఖాస్తు చేసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఇలా... కొత్తగూడెం 131, కొత్తగూడెం అర్బన్ 407, పాల్వంచ 201, పాల్వంచ అర్బన్ 190, భద్రా చలం 104, ఇల్లెందు 321, ఇల్లెందు అర్బన్ 148, మణుగూరు 206, మణుగూరు అర్బన్ లో 95 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఉన్న 70 యూనిట్లుకు 3,377 దరఖాస్తులు వచ్చాయంటే పోటీ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. లబ్ధిదారులను మున్సిపాలిటీలో కమిషనర్, మండలంలో మండల పరిషత్ అధికారులు ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
లబ్ధిదారులను ఎంపిక చేసి జిల్లా మైనారిటీ కార్యాలయం హైదరాబాద్ లోని మైనారిటీ శాఖకు పంపిస్తే, రుణాలు మంజూరవుతాయి. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2016-17 సంవత్సరంలో వంద శాతం సబ్సిడీ కింద 8 మంది లబ్దిదారులకు రూ. 50 వేల చొప్పున రుణాలు విడుదల చేశారు. 2017-18 నుంచి 2021-22, వరకు రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ రుణాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు.
దీంతో నాలుగేళ్లుగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. మళ్లీ 2022-23 సంవత్సరానికి గత డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. జిల్లలో సుమారు 80 వేల మంది మైనారిటీలు ఉన్నారు. వీరిలో ముస్లింలు 69 వేల మంది, బౌద్ధులు, పార్శీలు, జైనులు 10 వేలమంది ఉన్నారు. వీరికి రుణాల కోసం ప్రభుత్వం 70 యూనిట్లుకు గాను రూ.68 లక్షల బడ్జెట్ కేటాయించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana