Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri kothagudem District) లక్ష్మీదేవిపల్లి మండలం అటవీ ప్రాంతంలో గంగమ్మ కాలని, క్రాంతినగర్, గట్టుమల్ల పల్లెలు అనే పేరుతో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ పల్లెల్లో గుత్తి కోయలు కొన్ని ఏళ్లుగా నివసిస్తున్నారు. ఆ పల్లెలన్నింటికీ కలిపి 2013లో గంగమ్మ కాలనీలో మినీ అంగన్వాడీ సెంటర్ ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సెంటర్లో పక్కనే ఉన్న మైలారం గ్రామానికి చెందిన భానోత్ జ్యోతి అంగన్వాడి టీచర్ గా జాయిన్ అయ్యింది. గంగమ్మ కాలనీలో చిన్న పూరి గుడిసెలో సెంటర్ ను స్టార్ట్ చేసింది. మొదట్లో సెంటరులో పిల్లలు ఒక్కరూ రాలేదు. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించినా పెద్దగా లాభం లేకపోయింది. పైగా వాళ్లకు తెలుగు రాదు. జ్యోతికి వాళ్ల భాష రాదు. దాంతో వాళ్ల భాషలోనే అవగాహన కల్పిస్తే మారతారేమో అనుకుంది. రోజులో ఎక్కువసేపు వాళ్లతో ఉంటూ భాష నేర్చుకుంది. వాళ్లలో ఒకరిగా మారిపోయింది. వారి సాదక బాధకాలు పంచుకుంది.
ఈ ప్రయాణంలో ఆమె భర్త కూడా ఆమెకు సాయంగా నిలిచాడు. జ్యోతి ఇలా ఆ గుత్తి కోయ ప్రజలకు అందుబాటులో ఉంటూ, అవగాహన కల్పించడం వల్ల అంతకు ముందు అంగన్ వాడీ సెంటర్ గడప కూడా తొక్కని చిన్నారులు ఇప్పుడు ప్రతిరోజూ సెంటర్ వస్తున్నారు. దాంతో దాతల సాయంతో పూరి గుడిసె స్థానంలో ఒక గదిని కట్టించింది. ఈ పరిణామాలతో గంగమ్మ కాలనీలో 28 కుటుంబాలు, క్రాంతి నగర్ కాలనీలోని 38 కుటుంబాలు, గట్టుమల్లలో మరో పది కుటుంబాలు ఉన్న50 మంది పైగా గొత్తికోయల పిల్లలు అంగన్వాడీ సెంటర్ కి వస్తున్నారు. ఇందులో 25 మంది ప్రి స్కూల్ పిల్లలున్నారు. అయితే క్రాంతి నగర్ నుంచి గంగమ్మ కాలనీకి రావాలంటే గుంతల రోడ్డు మీద నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అందుకే ఆ గూడెంలో చదువుకున్న యువకుడితో అక్కడి పిల్లలకు చదువు చెప్పేలా ప్లాన్ చేసింది జ్యోతి. అయినా.. ప్రతి పది, పదిహేను రోజులకు ఒకసారి క్రాంతి నగర్ కు వెళ్లి పోషకాలున్న తినుబండారాలు ఇస్తుంటుంది.
అంతే కాకుండా క్రాంతి నగర్, గంగమ్మ కాలనీల్లో 19 మందికి పైగా బాలింతలు, గర్బిణులున్నారు, వాళ్లకు ఇప్పటికీ పోషకాలున్న తిండి అందని ద్రాక్షనే మిగిపోతుంది. అందుకే తన భర్త సాయంతో వాళ్లకు అప్పుడప్పుడు ఫ్రూట్స్ తీసుకెళ్లి ఇస్తుంటుంది. ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలతో కలిసి వాళ్ల ఆరోగ్యం స్థితిగతులను పరిశీలిస్తూ ప్రభుత్వం అందిస్తుంటుంది. అత్యవసరమైతే తన భర్తతో కలిసి రాత్రి టైంలో కూడా ప్రజలకు సాయం చేస్తుంది. కోవిడ్ టైంలో కూడా ప్రతిరోజూ వాళ్ల దగ్గరకు వెళ్లి అవగాహన కల్పిస్తూ అవసరమైన మెడిసిన్స్ ఇచ్చింది.
అలాగే మధ్యలో చదువు ఆపేసిన కొందరు స్టూడెంట్స్ ని మళ్లీ స్కూలుకు వెళ్లమని అవేర్నెస్ కల్పిస్తోంది. ఇలా తన వృత్తి యందు అత్యంత నిబద్ధత విధులు నిర్వహిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది జ్యోతి. ఇదే విషయమే న్యూస్ 18 ఆమెతో కాసేపు ముచ్చటించే ప్రయత్నం చేయగా ఆమె న్యూస్ 18 తో మాట్లాడుతూ.. అంగన్వాడీ సెంటర్లో టీచర్ గా చేరాక గంగమ్మకాలని, క్రాంతి నగర్ లో ఉంటున్న గొత్తి కోయల పరిస్థితి చూసి భయమేసింది. నేను ఇక్కడ పనిచేయగలుగుతానా? అనుకున్నా, వాళ్ల పరిస్థితి చూసి జాలేసింది. ఎలాగైనా మార్పు తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఐసీడీఎస్ సూపర్వైజర్, పీడీల సాయంతో ప్రయత్నం మొదలుపెట్టా. మినీ అంగన్వాడీ సెంటర్ కోసం దాతల సాయంతో గదిని కట్టించా. ఇప్పుడు నేను గొత్తికోయల్లో ఒకదాన్నైపోయా. వాళ్లు చేసుకునే పండుగలకు నన్ను తప్పకుండా పిలుస్తారు. వాళ్లకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా అని తెలిపారు ఆదర్శ అంగన్వాడి టీచర్ జ్యోతి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana