హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: ఆధార్ ఉన్నా ఆదరించే వారు లేరు.., ఈ వృద్ధురాలి పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది

Bhadradri: ఆధార్ ఉన్నా ఆదరించే వారు లేరు.., ఈ వృద్ధురాలి పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది

పబ్లిక్

పబ్లిక్ టాయిలెట్‌లో నివసిస్తున్న లక్ష్మి

Bhadradri: వృద్ధాప్యంలో అండగా ఉండేందుకు ఆమెకు పిల్లలు లేరు. కష్టసుఖాల్లో చివరి వరకు తోడుంటాడనుకున్న జీవిత భాగస్వామి అనారోగ్యంతో కన్నుమూశాడు. ఇన్నాళ్లూ నీడనిచ్చిన పూరిగుడిసె నేలమట్టమైంది. పొట్ట నింపుకోవడానికి పనికెళ్లాలన్నా వయసు సహకరించడం లేదు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  వృద్ధాప్యంలో అండగా ఉండేందుకు ఆమెకు పిల్లలు లేరు. కష్టసుఖాల్లో చివరి వరకు తోడుంటాడనుకున్న జీవిత భాగస్వామి అనారోగ్యంతో కన్నుమూశాడు. ఇన్నాళ్లూ నీడనిచ్చిన పూరిగుడిసె నేలమట్టమైంది. పొట్ట నింపుకోవడానికి పనికెళ్లాలన్నా వయసు సహకరించడం లేదు. ఇటువంటి దయనీయ స్థితిలో ఆ అభాగ్యురాలు జీవితాన్ని నెట్టుకొస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టిస్తుంది. తినేందుకు అన్నం లేదు, నిలువ నీడలేదు. దీంతో ప్రజా మరుగుదొడ్డిలోనే ఓ మూలన తల దాచుకుంటుంది ఆ వృద్ధురాలు.ఈ హృదయవిదారక జీవన దృశ్యం తెలంగాణ (Telangana) లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) భద్రాచలం (Bhadrachalam) పట్టణంలోని జగదీష్ కాలనీలో వెలుగు చూసింది. భద్రాచల పట్టణంలోని జగదీష్ కాలనీకి చెందిన కొమిడిపాటి లక్ష్మి 78 సంవత్సరాల వయస్సు. తన భర్త కొమిడిపాటి కోటేశ్వరరావు అనారోగ్య కారణాల వల్ల నాలుగేళ్ల క్రితం మృతి చెందడంతో సంతానం లేని ఈమహిళ రోడ్డున పడింది.

  నా అనే వారు లేక, కడు దీన స్థితిలో కాలం వెళ్లదీస్తోంది లక్ష్మి. ప్రభుత్వం నిర్మించిన ప్రజా మరుగుదొడ్డిలో ఆవాసం ఏర్పాటు చేసుకుని గత మూడేళ్ళుగా అందులోనే బిక్కుబిక్కుమంటూ జీవిస్తుంది. బహిరంగ మరుగుదొడ్లు పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవసరం నిమిత్తం ఓ పది నిమిషాలు వెళ్లాల్సి వస్తేనే.. ఏదో నరకంలోకి అడుగుపెడుతున్నట్లు భావిస్తాం. అలాంటిది వృద్ధ మహిళ మూడేళ్ళుగా ఆ మరుగుదొడ్డిలోనే నివసిస్తుంది. వినడానికే జుగుప్సాకరంగా ఉంటే.. అక్కడే జీవనం సాగిస్తున్న ఆ వృద్ధురాలి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.

  ఇది చదవండి: కలాపానిని తలపించే నిజాం కాలం నాటి జైలు.., మన తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?

  వృద్ధుల కోసం ఆ పథకాలు, ఈ పథకాలు అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా... ఇలా నా అనే వారు లేని వారి పరిస్థితి ఏంటో ప్రభుత్వానికి అధికారులకు ఎలా తెలుస్తుంది?. ఆధార్ కార్డు, ఓటర్ కార్డులు ఉన్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లక్ష్మికి అందడం లేదు. రేషన్ బియ్యం నుంచి మొదలు వృద్ధాప్య పింఛన్ వరకు ఎటువంటి ప్రభుత్వ ఫలాలు ఆమెకి అందకపోవడంతో కడు దుర్భరమైన జీవితాన్ని గడుపుతుంది. లక్ష్మి నిస్సహాయ స్థితిని చూస్తే ఎవరికీ కన్నీళ్లు రాక మానవు.

  ఇది చదవండి: సంపాదన కంటే సాంప్రదాయమే ముఖ్యం.., పురాణశాస్త్రాలకు ప్రాణం పోస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్..

  తోడు నీడలేని ఈ వృద్ధ మహిళకు ఆ కాలనీకి చెందిన కొందరు మహిళలే తోడు నీడై నిలిచారు. కాలనీ వాసులే కొద్దిమంది ఆమెకు భోజనం పెడుతున్నారు. పగలంతా బయట కూర్చుని రాత్రికి మరుగుదొడ్డి గదిలోనే నిద్రపోతుంటుంది. పరిసర ప్రాంతాలు చెత్తాచెదారం, పిచ్చి చెట్లు ఏపుగా పెరిగి పాములు, పురుగులు తిరుగుతున్నా చేసేది లేక అక్కడే బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఇప్పటికైనా అధికారులుగానీ, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులు గానీ స్పందించి.. ఏ తోడులేక, శరీరం సహకరించని ఈ వృద్ధురాలికి ప్రభుత్వ పథకాలు అందేలా చూసి సహకరించాలని స్థానికులు కోరుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadrachalam, Local News, Telangana

  ఉత్తమ కథలు