Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
21వ అంతరాష్ట్ర స్థాయి నాటకోత్సవ సాంస్కృతిక సంబరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) వేదికగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ సంబరాలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి నిర్వహిస్తారు. తొలినాళ్లలో అతి చిన్నగా ప్రారంభమైన ఈ సంబరాలు గత 21 ఏళ్లగా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. భద్రాచల పట్టణానికి చెందిన ఆర్టిసి చిరుద్యోగుల మదిలో మెదిలిన ఓ చిన్న ఆలోచన నేడు వట వృక్షంలా మారింది. కళాభారతి వ్యవస్థాపకులు, కార్యదర్శి అల్లం నాగేశ్వరరావు నేతృత్వంలో 21వ ఏట అడుగుపెడుతున్న ఈ కార్యక్రమంలో ఎన్నో సందేశాత్మక నాటికలను ప్రదర్శింపజేస్తారు. దేశంలోని పలు ప్రాంతాల నుండి కళాకారులు ఇక్కడికి తరలివచ్చి వారి నటనతో ప్రేక్షకులను మెప్పించి, మనస్సులను దోచుకుంటున్నారు.
చక్కటి ప్రదర్శన చేసిన వారికి మంచి పారితోషకాన్ని సైతం అందిస్తూ భద్రాద్రి కళాభారతి వారు కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. నాటక రంగం మరుగున పడిపోయిన వేళ భద్రాచలం వేదికగా నిర్విరామంగా సాగుతున్న ఈ నాటికల పండుగ భద్రాద్రి సిగలో ఓ మరుపురాని ఘట్టం అని పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగాభద్రాద్రి కళాభారతి నాటకోత్సవాలు అంటే భద్రాచలంలో సంస్కృతిక సందడి చోటు చేసుకుంటుంది. ప్రతి ఏటా మూడు రోజుల పాటుగా సాగే కార్యక్రమాలను తిలకించేందుకు పట్టణ ప్రముఖులతోపాటు ఇతర ప్రాంతాల నుండి కూడా కళాభిమానులు ఇక్కడికి చేరుకుంటారు.అంతేకాకుండా ప్రతి ఏటా భద్రాద్రి కళాభారతి అంతరాష్ట్ర నాటకోత్సవాల సందర్భంగా పలువురు కళాకారులను సన్మానించి సత్కరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న విషయం.
గడిచిన ఏళ్లలో ఎందరో సినీ ప్రముఖులు, హీరోలు, హీరోయిన్లు, నటులను ఇక్కడికి గౌరవంగా పిలిచి సన్మానించి సత్కరించారు. ఆ ఒరవడి కొనసాగింపుగా సన్మానాలు, సత్కారాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది కూడా పలువురు ప్రముఖులను సత్కరించనున్నారు. పాడుతా తీయగ విన్నర్, సినీ నేపథ్య గాయని తేజస్వినిని సత్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె తన గళం నుండి మధురమైన పాటలను వినిపిస్తారు. గద్దె రామనర్సయ్యకు ఆత్మీయ సత్కారం, తాడ క్రియేషన్స్ అధినేత తాండ్ర వెంకట రమణకు ఆత్మీయ సత్కారం, జానపద గాయని రాణికి ఆత్మీయ సత్కారం చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana