(D Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)
భద్రాచలంలోని (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి (Sri Sita Ramachandra swamy) దేవస్థానంలో జరిగే ఆర్ధిక లావాదేవీల (Financial transactions) వ్యవహారం 'లోగుట్టు పెరుమాళ్ళకెరుక' అన్నచందంగా తయారైంది. భద్రాచల ఆలయంలో 1994 నుంచి 2019 వరకు స్వామి వారి ఖజానా నుంచి ఖర్చు చేసిన సొమ్ములో రూ. 76 కోట్లకు పైగాఆడిట్ అభ్యంతరాలను ఆడిట్ అధికారులు వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. గడిచిన 2020, 2021 ఆడిట్ రిపోర్టును కలిపితే ఆడిట్ అభ్యంతరాలు (Audit objections) రూ. 100 కోట్ల మార్కు దాటే అవకాశం ఉంటుందని అంచనా. భద్రాద్రి దేవస్థానంలో ఆడిట్ అభ్యంతరాలు ప్రధానంగా అకౌంట్స్, ల్యాండ్స్ విభాగాల్లోనే ఉన్నట్లు సమాచారం.
డిపాజిట్ చేయడంలో జాప్యం..
నిత్యం ఆర్జిత సేవల ద్వారా లక్షల రూపాయలు వస్తుంటాయి. ఆ మొత్తాన్ని సకాలంలో బ్యాంకులో వేసి ఆ మేరకు అకౌంట్స్ (Accounts) విభాగంలో రిజిస్టర్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విభాగాలకు సంబంధించిన పోస్టింగ్లు పూర్తి స్థాయిలో సాగడం లేదన్న విమర్శలున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆర్జిత సేవల నుంచి వచ్చిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడంలో జాప్యం జరగడంతో, ఆడిట్ సమయంలో ఈ జాప్యానికి కారణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఇక ల్యాండ్స్ విభాగంలో ఆర్థిక లావాదేవీల నమోదులో జాప్యం జరుగుతున్నట్లు విమర్శలున్నాయి.1994 నుంచి 2022 వరకు రూ. 100 కోట్ల మార్కుకు చేరువలో ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమవుతుంటే ఇంతకాలంగా భద్రాచలం దేవస్థానం అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదు? ఎందుకు జాప్యం జరిగిందనే? ప్రశ్నలు సర్వత్రా తలెత్తుతున్నాయి.
అయితే ఇంత పెద్ద మొత్తంలో ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో సాంకేతికపరమైన లోపాలు (Technical Issues), పొరపాట్లు తప్ప అవినీతికి సంబంధించిన అంశాలు అంతగా ఉండే అవకాశంలేదని దేవస్థాన ఉన్నతాధికారులు తెలియజేస్తున్నప్పటికీ, కార్యనిర్వహణాధికారి ఉపయోగించే కారు డీజిల్ నుంచి మొదలు కారు ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ వరకు, నిరుపయోగంగా కొనుగోలు చేసిన కంప్యూటర్ల నుంచి పేపర్ల వరకు, ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ ప్రధాన దేవస్థానాల నుంచి సీతారాముల కళ్యాణం నిమిత్తం వచ్చే పట్టు వస్త్రాల వరకు... ఇలా అనేక విషయాల్లోఆడిట్ అధికారులు వ్యక్తం చేసిన అభ్యంతరాలకు ఎటువంటి సమాధానం ఇస్తారో వేచి చూడాల్సిందే. రూ. 100 కోట్లకు చేరువలో ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో వాటిని పద్దు తేల్చేందుకు ఆగస్టు చివరి వారం నుంచి అక్టోబరు వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిచాలని దేవస్థానం ఉన్నతాధికారులు నిర్ణయించారు.
OMG: ప్రభుత్వ ఉద్యోగినా.. మజాకా.. రూ. 8 లక్షల డీజిల్ తాగేసిన మునిసిపల్ సిబ్బంది
ఇందులో భాగంగా ల్యాండ్స్ అండ్ లీజెస్ విభాగం, అకౌంట్స్ విభాగం, మనీ వాల్యూడ్ విభాగం, ఎస్టాబ్లిష్మెంట్ విభాగం, ఇతర విభాగాలకు కమిటీలను ఏర్పాటు చేస్తూ... దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బి.శివాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలకు సంబంధిత పర్యవేక్షకులుగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 1, 2లు వ్యవహరించనున్నారు. ఈ ఆడిట్ అభ్యంతరాల స్పెషల్ డ్రైవ్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఈవో ఇప్పటికే ఆదేశించారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చట్టరీత్యా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటికే పలు విభాగాల నుంచి సుమారు రూ.13 కోట్ల అభ్యంతరాలకు సమాధానాలు సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadrari kothagudem, Financial Planning, Local News