Home /News /telangana /

BEWARE OF THESE ONLINE FRAUDS THIS WILL LEAD YOUR BANK BALANCE ZERO MS KMM

టచ్‌ చేసి చూడకండి.. క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ వలలో పడ్డారో.. ఇక అంతే సంగతులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎక్కడో కూర్చుని మన స్మార్ట్‌ ఫోన్‌కు ఓ మెసేజ్‌ పంపుతారు.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉందంటారు.. లింక్‌ను టచ్‌ చేస్తే మీ అకౌంట్‌కు బ్యాలెన్స్‌ క్రెడిట్‌ అవుతుందని మెసేజ్‌లో మెన్షన్‌ చేస్తారు.. ఏదైనా పర్చేజింగ్‌కు సబంధించిన క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ అయి ఉంటుందనుకుని ఆ లింక్‌ను టచ్‌ చేశారా.. బ్యాంక్ బ్యాలెన్స్ గోవిందా.. గోవిందా..

ఇంకా చదవండి ...
 • News18
 • Last Updated :
  రోజురోజుకూ ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. స్మార్ట్ ఫోన్లు వచ్చాక వివిధ పేమెంట్‌ గేట్‌వే ఆప్షన్లు పెరగడం.. సులభతర చెల్లింపుల కోసం రకరకాల పేర్లతో యాప్‌లు అందుబాటులోకి రావడం.. కరెంటు బిల్లులు.. ఫోన్ బిల్లులు.. ప్రాపర్టీ ట్యాక్సులు.. పేపర్‌ బిల్లు.. పాల బిల్లు.. కూరగాయలు.. ఇంకా ఇంట్లోకి కావాల్సిన వెచ్చాల బిల్లులు సహా దాదాపు చెల్లింపుల కోసం ఎక్కువ మంది ఈ ప్లాట్‌ఫాంనే ఎంచుకుంటున్నారు. ఇంకేం దీన్నే ఆసరా చేసుకుని మోసకారులు రెచ్చిపోతున్నారు. ఎక్కడో కూర్చుని మన స్మార్ట్‌ ఫోన్‌కు ఓ మెసేజ్‌ పంపుతారు.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉందంటారు.. లింక్‌ను టచ్‌ చేస్తే మీ అకౌంట్‌కు బ్యాలెన్స్‌ క్రెడిట్‌ అవుతుందని మెసేజ్‌లో మెన్షన్‌ చేస్తారు.. ఏదైనా పర్చేజింగ్‌కు సబంధించిన క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ అయి ఉంటుందనుకుని ఆ లింక్‌ను టచ్‌ చేశారా.. మీ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌ ఖాళీ కావడం ఖాయం..

  ఇలా రోజురోజుకూ స్మార్ట్‌ ఫోన్లలో వచ్చే మెసేజ్‌లు.. వాటి లింకులను టచ్‌ చేసి చేతులు కాల్చుకున్న వారి సంఖ్య పెరుగుతునే ఉంది. కేసులు నమోదు.. విచారణ మామూలే. కానీ ఎవరికీ ఒక్క రూపాయి కూడా తిరిగి వచ్చిన దాఖలా లేదు. ఇదీ ఈ మధ్య కాలంలో పెరుగుతున్న సైబర్‌ క్రైం తీవ్రత.

  క్యాష్ బ్యాక్ ఆఫరేమో అనుకుని...

  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ హమాలీకాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్‌ సెల్‌ఫోన్‌కు ఈ నెల 9వ తేదీన ఓ మెసేజ్‌ వచ్చింది. ఫోన్‌పే యాప్‌ లోగోతో ఉండడం వల్ల.. తాను గతంలో కొనుగోలు చేసి, పూర్తి చేసిన చెల్లింపుల తాలూకూ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ అయి ఉంటుందని భావించాడు. ఆ మెసేజ్‌ను ఏమాత్రం అనుమానించకుండా టచ్‌ చేశాడు. వెంటనే అక్కడో యాడ్‌ లింక్‌ డిస్‌ప్లే వచ్చింది. దాన్ని కూడా టచ్‌ చేశాడు. వెంటనే తన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలో ఉన్న రూ.499 విత్‌డ్రా అయినట్టు మెసేజ్‌ వచ్చింది. అనుమానించిన శ్రావణ్‌ తన అకౌంట్‌ నుంచి నగదు ఎందుకు కట్‌ అయిందో తెలుసుకునేందుకు ఫోన్‌పే కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేశాడు. ఆ వెంటనే శ్రావణ్‌కుమార్‌కు మరో నెంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. 'తాము ఫిర్యాదును స్వీకరిస్తున్నామని.. మేము పంపిన మెసేజ్‌ను ఓపెన్‌ చేసి.. 'శ్రావణ్‌ రీఫండ్‌' అని టైప్‌ చేయాలని సూచించారు. వెంటనే శ్రావణ్‌ ఫోన్‌లో వచ్చిన మెసేజ్‌కు స్పందించాడు.

  ఉన్నదంతా ఊడ్చారు... 

  అలా టైప్‌ చేయగానే మరోసారి అకౌంట్‌లో ఉన్న రూ.99,662 నగదు విత్‌డ్రా చేసినట్టు శ్రావణ్ కు మెసేజ్‌ వచ్చింది. అప్పటికి గానీ శ్రావణ్‌కుమార్‌కు తాను మోసపోయానని అర్థం కాలేదు. వెంటనే అకౌంట్‌ ఉన్న బ్యాంక్‌ బ్రాంచిని సంప్రదించాడు. సైబర్‌ నేరస్తుల పని అని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని వాళ్లు సూచించారు. దీంతో బాధితుడు పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు చెప్పినా ఉపయోగం లేదని, జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఉన్న సైబర్‌ క్రైం వింగ్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీంతో అప్పటికే ఢీలా పడిపోయిన బాధితుడు అధికారుల సమాధానానికి మరింత బెంబేలెత్తిపోయాడు.

  పోలీసులతో లాభం లేదనుకుని...

  దీంతో బాధితుడు శ్రావణ్‌ ఫోన్‌పే యాప్‌ నిర్వహకులకు ఫిర్యాదు చేశాడు. నేరస్తులు డూప్లికేట్‌ సిమ్‌తో హ్యాక్‌ చేశారని, రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలు అందిస్తామని చెప్పారు. కానీ ఘటన జరిగి రెండురోజులు గడుస్తున్నా ఇప్పటికీ సైబర్‌ క్రైం పోలీసులు కనీసం విచారణ ప్రారంభించలేదని బాధితుడు వాపోతున్నాడు. ఇది ఒక్క శ్రావణ్‌కుమార్‌ వేదన మాత్రమే కాదు. నిత్యం ఎందరో బాధితులవుతున్నారు. సెల్‌ఫోన్‌కు ఏదో ఒక మెసేజ్‌ రావడం.. టచ్‌ చేస్తే ఏదో ఒక లింక్‌ టచ్‌ చేయమని సూచించడం..తీరా చూస్తే అకౌంట్‌ ఖాళీ అవడం మామూలుగా మారింది. శ్రావణ్‌కుమార్‌ విషయంలోనే చూస్తే అతని అకౌంట్‌ నుంచి లక్ష రూపాయలు కొట్టేశారు. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి ఇది కోలుకోలేని మొత్తం. దీనిపై ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఏం చేయగలుగుతారో తెలీని పరిస్థితి. కొన్ని కొన్ని సార్లు ఏదైనా ట్రాన్సాక్షన్‌ జరిపితే అకౌంట్‌ నుంచి నగదు డెబిట్‌ అవుతుంది.. కానీ చేరాల్సిన వారికి క్రెడిట్‌ కాదు. ఇలా నిత్యం ఎందరో టెక్నాలజీలోని లోపాల బారిన పడి నష్టపోతున్నారు. దీనిపై ఒక సమగ్ర విధానం తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు కోరుతున్నారు.
  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Cash, Fraud, Khammam, Online fraud, Telangana, Telangana News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు