'టిక్ టాక్ ప్రొ' పేరిట ఫోన్‌కు సందేశం వచ్చిందా.. ఐతే జాగ్రత్త.. లేదంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

టిక్ టాక్ కథ ముగియడంతో ప్రత్యామ్నాయ యాప్స్‌పై దృష్టిసారించింది యువత. చింగారి, ట్రెల్, రొపొసొ, షేర్ చాట్ వంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు.

  • Share this:
    భారత్‌లో టిక్ టాక్ ప్రస్థానం ముగిసిన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి ఇప్పటికీ చాలా మంది టిక్ టాక్ యూజర్లు కోలుకోలేదు. నిత్యం టిక్ టాక్‌లో గడిపే వారంతా.. ఇప్పుడు ఆ యాప్‌ లేక అల్లాడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారిని టార్గెట్ చేస్తూ.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. టిక్ టాక్ పేరిట మోసపూరిత లింక్‌లు పంపుతూ బ్యాంకు ఖాతాలను కాజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పలు కేసులు ఇప్పటికే పోలీసుల దృష్టికి వెళ్లాయి. టిక్ టాక్ వీడియోలు మళ్లీ చేసుకోవచ్చని.. టిక్ టాక్ ప్రొ పేరుతో యాప్ వచ్చిందని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సందేశం వస్తుంది. ఈ లింక్ క్లిక్ చేస్తే టిక్ టాక్ యాప్ డౌన్‌లోడ్ అవుతుందని చెబుతారు. పొరపాటున దాన్ని క్లిక్ చేశారో.. ఇక అంతే సంగతులు. బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

    కాగా, టిక్ టాక్ సహా మొత్తం 59 చైనీస్ అప్లికేషన్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. విస్తృత డిజిటల్ మార్కెట్‌గా అవతరించిన భారతదేశంలో కోట్లాది భారతీయుల గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని.. చైనా యాప్స్‌తో దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పుందని ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది. వీటిని దుర్వినియోగం చేస్తూ, డౌటా చౌర్యంతో పాటు విదేశాల్లో సర్వర్లకు అనధికారికంగా డేటాను తరలిస్తున్నారన్న సమాచారం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే చైనీస్ యాప్స్‌ను దేశంలో నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

    కేంద్రం నిషేధించిన యాప్స్‌లో ఎక్కువ మంది భారతీయులు ఫాలో అయినది టిక్ టాక్ అప్లికేషనే..! కేంద్రం బ్యాన్ చేయడంతో గూగుల్, యాపిల్ కంపెనీ తమ యాప్ స్టోర్స్‌ నుంచి టిక్ టాక్‌ యాప్‌ను తొలగించాయి. ఇప్పటికే ఇన్‌స్టాల్ అయి ఉన్నా.. అది పనిచేయడం లేదు. టిక్ టాక్ కథ ముగియడంతో ప్రత్యామ్నాయ యాప్స్‌పై దృష్టిసారించింది యువత. చింగారి, ట్రెల్, రొపొసొ, షేర్ చాట్ వంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఈ దేశీయ యాప్స్‌ డౌన్‌లోడ్స్ భారీగా పెరిగాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: