కరోనా మహమ్మరి ప్రపంచాన్ని స్థంభింపజేసింది. లాక్డౌన్ కారణంగా బీడీ కార్మికులకు పని లేక ఆవస్థలు పడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని బీడి కార్మికులు నెల రోజులుగా పైగా జీతాల్లేక ఆకలితో అలమటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది బీడీలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. బీడీ పరిశ్రమల్లో బీడీలు చుట్టేవారు, ప్యాకింగ్ చేసేవారు, నెల జీతంపై పనిచేసే ఉద్యోగులు, కమీషన్ ఏజేంట్లు వీరందరి ఉపాధి బీడీలే. కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన చట్టాలతో ఇప్పటికే సంక్షోభంలో ఉన్న బీడీ పరిశ్రమకు కరోనా కారణంగా లాక్ డౌన్ తో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయ్యింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2లక్షల50వేల మంది బీడీ పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వెయ్యి బీడీలు చుడితే కార్మికులకు రూ.186 చెల్లిస్తారు. కరోనా కారణంగా మార్చి 22 నుంచి బీడీ పరిశ్రమలు మూతపడ్డాయి.
దీంతో బీడీ కార్మికులకు పనిలేక, పూట గడవక నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పరిశ్రమలలో పనిచేసిన వారికి యాజమాన్యాలు ఫిబ్రవరి నెల వేతనాలను మాత్రమే చెల్లించి.. మార్చి నెల వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో ఆ కార్మికులకు చేతిలో డబ్బులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ, పండుగలు ఇతర సెలవు చట్టం 1974 ప్రకారం లాక్డౌన్ కాలాన్ని వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 161, 168లను విడుదల చేసింది. ఈ జీవోల ప్రకారం ఆకలితో అలమటిస్తున్న బీడీలు చుట్టే కార్మికులకు, బీడీ ప్యాకర్లకు, నెలసరి జీతాలు ఉద్యోగులకు, బీడీ కమిషన్ ఏజెంట్లకు 2020సంవత్సరం ఫిబ్రవరి నెలలో పొందిన వేతనాల ప్రాతిపదికగా తక్షణం చెల్లించాలని బీడీ యాజమాన్యల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి కార్మికులకు జీతాలు ఇప్పించాలని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమలో పని చేసే అన్ని రకాల కేటగిరీల కార్మికులకు, బీడీ కమిషన్ ఏజెంట్లకు వేతనాలు చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షులు వనమాల క్రిష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల రూరల్ ఏరియాల్లో కరోనా నియంత్రణలో ఉంది. వెంటనే బీడీ ఫ్యాక్టరీలను తెరిచి బీడీ కార్మికులందరికీ పని కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.