బతుకమ్మ చీరలకు షాక్... పంపిణీకి బ్రేక్... అడ్డుగా ఎన్నికల కోడ్

Bathukamma Sarees 2019 : బతుకమ్మ పండుగ కోసం ఆడపడుచులకు చీరలు పంచేందుకు ఆరు నెలల నుంచీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసుకుంటే... హుజూర్‌నగర్ ఉప ఎన్నిక రావడంతో... ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి... సూర్యాపేట జిల్లాలో పంపిణీకి బ్రేక్ పడింది. ఎన్నికల తర్వాతే... పంపిణీ అంటున్నారు అధికారులు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 23, 2019, 6:12 AM IST
బతుకమ్మ చీరలకు షాక్... పంపిణీకి బ్రేక్... అడ్డుగా ఎన్నికల కోడ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Bathukamma Sarees 2019 : తెలంగాణ ఆడపడుచులకు నిజంగా ఇది చేదు వార్తే. అదీకాక... ఈసారి ప్రభుత్వం చక్కటి బతుకమ్మ చీరలు తయారుచేయించింది. రకరకాల కలర్స్‌కి తోడు క్వాలిటీ కూడా పెంచింది. అన్నీ సిద్ధం చేసి... ఇవాళ్టి నుంచీ పంచేద్దామని డిసైడైతే... సడెన్‌గా వచ్చిన ఎన్నికల కోడ్ ఆశలపై నీళ్లు చల్లింది. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో... ఆ నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలో ఉండటంతో... ఆ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అందువల్ల సూర్యాపేట జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీని నిలిచిపోయింది. ప్రభుత్వ కానుక పొందాలని ఎదురుచూసిన సూర్యాపేట జిల్లా ఆడపడుచులకు ప్రస్తుతానికి నిరాశ కలుగుతున్నట్లే. ఎన్నికలు ముగిసిన తర్వాతే వాళ్లకు చీరల పంపిణీ ఉంటుంది.

సూర్యాపేట జిల్లాలో 3,69,703 మంది మహిళలు చీరలు పొందాల్సి ఉంది. ప్రభుత్వ రూల్స్ ప్రకారం తెల్లరేషన్‌కార్డు ఉండి, 18 ఏళ్లు నిండిన మహిళలకు చీరలు ఇస్తారు. ఇప్పటికే 1,95,000 చీరలు జిల్లాకు చేరాయి. వాటిని ఆయా నియోజకవర్గాల పరిధిలోని గోడౌన్లలో దాచి, గ్రామాల వారీగా పంపిణీకి అధికారులు రెడీ చేశారు. ఐతే జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు శనివారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగుతుంది. అందువల్ల వెంటనే జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా జిల్లాలో అధికారిక కార్యక్రమాలేవీ నిర్వహించే ఛాన్స్ లేదు. ఎన్నికల కోడ్‌ వల్ల పండుగ నాడు ప్రభుత్వ చీరలు అందకుండా పోయినట్లవుతోంది.

ఈసారి బతుకమ్మ చీరల ప్రత్యేకతలు ఇవీ : బతుకమ్మ పండుగకు చీరలు పంచిపెట్టే సంస్కృతిని మరింతగా అభివృద్ధి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నేటి నుంచీ 100 రకాల చీరల్ని అన్ని నియోజకవర్గాల్లో (సూర్యాపేట జిల్లా తప్ప) పంచిపెట్టబోతోంది ప్రభుత్వం. బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులకు చీరలు ఇస్తే... వాటిని తయారుచేసేందుకు మరమగ్గ కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఇదివరకు మరమగ్గ కార్మికులకు నెలకు రూ.8వేల నుంచి రూ.12వేలు మాత్రమే వచ్చింది. బతుకమ్మ చీరల తయారీ కారణంగా నెలకు రూ.16వేల నుంచి రూ.20వేల దాకా వస్తోంది. ఈ మంచి ఉద్దేశంతో ప్రభుత్వం మూడేళ్ల కిందట ఈ కార్యక్రమం ప్రారంభించింది. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన యువతులు, మహిళలకు చీరలు ఇస్తోంది. ఈ ఏడాది కోటి 2వేల మందికి ఇవ్వబోతోంది. మొత్తం 16000 కుటుంబాలు, 26000 మర మగ్గాల్ని వాడి... ఈ చీరల్ని తయారుచేశాయి. 10 రకాల డిజైన్లు, 10 రకాల రంగులు కలిపి... 100 వరైటీల్లో చీరలు రెడీ అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.313 కోట్లు ఖర్చు పెట్టింది. బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం మూడేళ్లలో రూ.715 కోట్లు ఖర్చు చేసింది.

గ్రామ, వార్డు స్థాయిలో కమిటీలు చీరల్ని పంచుతాయి. ఈసారి చీరల క్వాలిటీ పెంచారు. చీరతోపాటు జాకెట్ కూడా ఇవ్వబోతున్నారు. ఒక్కో చీర తయారీకి జీఎస్టీ కాకుండా రూ.280 ఖర్చు చేశారు. 2017లో 95,48,439, 2018లో 96,70,474 చీరెలు పంచారు. ఈసారి పంచే 1.02 కోట్ల చీరల్లో... 75 లక్షల చీరలు ఆల్రెడీ జిల్లాలకు వెళ్లిపోయాయి. కాబట్టి... అర్హులైన మహిళలు... ఆయా గ్రామ, వార్డు స్థాయిలో కమిటీ సభ్యులను కలిసి... చీరలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐతే... గ్రామ స్థాయి కమిటీలో పంచాయతీ, గ్రామ రెవెన్యూఅధికారి, గ్రామ మహిళాసంఘం ఆఫీసు బేరర్, రేషన్‌షాపు డీలర్... వార్డు స్థాయి కమిటీలో బిల్‌కలెక్టర్, వార్డు మహిళాసంఘం ఆఫీసు బేరర్, రేషన్‌డీలర్ సభ్యులుగా ఉంటారు. వారిని కలిసి అర్హులైన మహిళలు చీరలు పొందాల్సి ఉంటుంది.
First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading