TSPSC : తెలంగాణలో గ్రూప్ 1 సహా కొన్ని పేపర్ల లీకేజీపై దర్యాప్తు చేస్తున్న సిట్ (SIT) అధికారులు.. నిన్న.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటికి వెళ్లి.. రెండోసారి నోటీస్ ఇచ్చారు. నేడు తమ ముందు హాజరు కావాలని కోరారు. రద్దయిన గ్రూప్ 1 పరీక్షలో సిరిసిల్ల ప్రాంతం వారికే ఎక్కువగా వందకు పైగా మార్కులు వచ్చాయని బండి సంజయ్ ఈమధ్య కామెంట్స్ చేశారు. అందుకు ఆధారాలు సమర్పించాలంటూ సిట్ అధికారులు CrPC సెక్షన్ 91 కింద ఈ రెండో నోటీస్ ఇచ్చారు. ఐతే.. ఇవాళ బండి సంజయ్.. సిట్ అధికారుల ముందు హాజరు కావట్లేదు. ఆయన బదులు.. బీజేపీ లీగల్ సెల్ సభ్యులు హాజరవుతారని తెలిసింది. మరి ఇందుకు సిట్ అధికారులు ఒప్పుకుంటారా లేక.. బండి సంజయ్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని మరో నోటీస్ పంపిస్తారా అనేది ఇవాళ తెలుస్తుంది.
బీదర్‌కు బండి సంజయ్ :
బండి సంజయ్‌కి ఇవాళ ప్లాన్ వేరే ఉంది. ఇవాళ ఆయన కర్ణాటకలోని బీదర్‌కి వెళ్తున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన వారికి సంబంధించి బీజేపీ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సభలో బండి సంజయ్ పాల్గోనున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఈ కార్యక్రమం ఉంటుంది. అందువల్ల ఇందులో పాల్గొనడానికి సంజయ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
పేపర్ లీకేజ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే అంటున్న బండి సంజయ్.. మొదటి నుంచి సిట్ దర్యాప్తును లెక్కలోకి తీసుకోవట్లేదు. అందుకే ఆయన సిట్ అధికారులకు ఆధారాలు ఇచ్చేది లేదంటున్నారు. తనకు నోటీస్ ఇచ్చినట్లుగానే మంత్రి కేటీఆర్‌కి కూడా ఇవ్వగలరా అని సిట్ అధికారులకు సవాల్ విసురుతున్నారు. పేపర్ లీకేజీ కేసులో ఇద్దరిదే తప్పు అని కేటీఆర్ ఎలా అంటారని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. ఇలా ఈ అంశం రాజకీయంగా కాకరేపుతూనే ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay