దళితులకే కాదు.. బీసీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాలకూ 'బంధు' పథకం.. సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

CM KCR: తెలంగాణలో మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు చిరస్థాయిగా ఉంటాయని ఆయన అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తెలంగాణ సాధించుకున్నామని... అదే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

 • Share this:
  ఇప్పుడు తెలంగాణ అంతటా దళిత బంధు  (Dalitha Bandhu scheme)పథకం గురించే చర్చ జరుగుతోంది. దళిత సాధికారతే లక్ష్యంగా ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. ఇప్పటికే సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో డబ్బులు అందజేశారు. అనంతరం హుజురాబాద్ (Huzurabad) నియోజకవర్గంలో ఈ పథకాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) లాంఛనంగా ప్రారంభించారు. ఐతే దళితులకు మాత్రమే కాదు.. గిరిజనులు, ఇతర సామాజికవర్గాల్లలోనూ పేదలందరికీ డబ్బులు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తమకూ బంధు పథకం అమలు చేయలని.. ముదిరాజ్, గౌడ సామాజికవర్గాలకు చెందిన పలువురు హుజురాబాద్‌లో ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కేవలం దళితులకు మాత్రమే కాదు.. రానున్న రోజుల్లో బీసీ, ఎస్టీ, ఎంబీసీ, మైనారిటీలు, బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణ పేదలకూ బంధు పథకాన్ని తెస్తామని స్పష్టం చేశారు.

  మంగళవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ (Telangana Rashtra Samithi) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించారు. దాదాపు రెండున్న గంటల పాటు జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జనరల్ సెక్రటరీ కే. కేశవరావు, ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్... దళిత బంధు పథకంపై ప్రతి గ్రామంలోనూ ప్రచారం నిర్వహించాలని సూచించారు. దళితల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన ఈ పథకంపై విపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయని.. వారి విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్‌లో ఉన్న నేతలంతా ఖచ్చితంగా క్రమశిక్షణను పాటించాలని.. నాయకుల తీరును ప్రజలు గమనిస్తుంటారని, నచ్చకపోతే ఓడగొట్టేందుకు వెనకాడరని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలంతా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. వారి ఆదరాభిమానాలు చూరగొనాలని సూచించారు.

  Huzurabad: టీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. హుజూరాబాద్‌లో ఆ పార్టీ బరిలోకి దిగుతుందా ?

  ఇక తెలంగాణలో మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ (TRS) పార్టీ అధికారంలో ఉంటుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు చిరస్థాయిగా ఉంటాయని ఆయన అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తెలంగాణ సాధించుకున్నామని... అదే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దళిత బంధు పథకం మాదిరిగానే.. గిరిజిన, బీసీ, ఎంబీసీ, మైనారిటీ, బ్రాహ్మణ, ఇతర అగ్రవర్ణ పేదలకు కూడా బంధు పథకం తీసుకొస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రాధాన్య క్రమంలో ముందుగా దళితులకు ఇస్తున్నామని.. దశల వారీగా పేదలందరికీ పథకాన్ని తెస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

  Telangana: ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై ఉత్తర్వులు విడుదల.. పూర్తి వివరాలు ఇవే

  కాగా, దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అన్ని దళిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా ఇటీవలే హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించారు. అక్కడ ప్రతి దళిత కుటుంబానికీ సాయం అందుతుంది. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం దశల వారీగా దళిత బంధును అమలు చేయనున్నారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు రూ.10 లక్షల సాయం అందించనున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకానికి అర్హులని.. ఐతే వారికి చివరి దశలో దళిత బంధును ఇస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.

  Telangana: టీఆర్ఎస్‌కు షాక్.. పార్టీలో ఉంటూ సోనియాగాంధీని పొగిడిన ఎమ్మెల్యే
  Published by:Shiva Kumar Addula
  First published: