AYURVEDIC TREATMENT FOR COUPLES WHO DO NOT HAVE CHILDREN IN PEDDAPALLY MS KNR
ఆకు పసరు తాగితే కడుపు పండుద్దొంట.. క్యూ కడుతున్న పిల్లలు లేని దంపతులు.. ఎక్కడో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
పిల్లలు లేని వారికి ఆకు పసరు తాగించి వారికి సంతాన ప్రాప్తిని ఇస్తున్నాడు ఒక వైద్యుడు. దీంతో ప్రతి ఆదివారం ఇక్కడికి పిల్లలు లేని దంపతులు క్యూ కడుతున్నారు.
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. మనిషి ప్రయాణం ఎల్లలు దాటుతున్నా.. శాస్త్ర సాంకేతిక విషయాలు కొత్త పుంతలు తొక్కుతున్నా... మన దేశంలో మాత్రం నమ్మకాలకు మించింది మరోకటి లేదు. నమ్మకాలు వ్యక్తిగతమైనంత వరకు ఎవరికీ సమస్య లేదు. కానీ అవి సమాజంలోకి వెళ్లి మూఢంగా మారితేనే లేనిపోని అనర్థాలకు దారి తీస్తున్నాయి. ఇప్పటికీ దేశంలోని గ్రామాల్లో చాలా వరకు ఈ నమ్మకాలే మోసాలకు పునాధులు. వాటిని ఆసరాగా చేసుకునే పలువురు నాటు వైద్యులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. దీర్ఘకాలిక రోగాలు నయం చేస్తామని.. పిల్లలు లేని వారికి పిల్లలు కల్పిస్తామని చెప్పి ఏవేవో ఆకు పసర్లు తీసుకొచ్చి వారితో తాగిస్తున్నారు. వీరిలో ఫలించేది కొందరైతే.. అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడేవాళ్లు అధికులు ఉన్నారు.
వివరాల్లోకెళ్తే.. పిల్లలు లేని వారికి ఆకు పసరు తాగించి వారికి సంతాన ప్రాప్తిని ఇస్తున్నాడు ఒక వైద్యుడు. దీంతో ప్రతి ఆదివారం ఇక్కడికి పిల్లలు లేని దంపతులు క్యూ కడుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాదు చెందిన ఖలీమ్ అనే ఆర్ఎంపీ వైద్యుడు చెట్ల మందులతో వైద్యం చేస్తున్నాడు. వంశపారంపర్యంగా వస్తున్న ఈ చికిత్స విధానంతో సంతానం లేనివారికి చెట్ల పసరు పోస్తున్నారు. ఈ చెట్ల పసరుతో పిల్లలు పుడుతున్నారని ఇక్కడి వారిలో గట్టి నమ్మకం ఏర్పడింది. దీంతో చాలా ఏళ్లుగా ఇక్కడ ఈ పసరు వైద్యం కొనసాగుతోంది.
పసరు మందు తాగిన మూడు నుంచి నాలుగు వారాల వ్యవధిలోనే అది తాగిన మహిళలు గర్భం దాల్చుతారని, అయితే ఈ పసరు మందుకు కొన్ని నియమాలు పాటిస్తేనే దాని ఫలితాలు కనపిస్తాయని అంటున్నారు. ఆ నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందనే ప్రచారం సాగుతోంది. దీంతో ప్రతి ఆదివారం ఆయనదగ్గరకి జాతరలా పసరు వైద్యం కొనసాగుతోంది.
తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ పసరు వైద్యంతో ఇప్పటికీ సుమారుగా 400 లకు పైగా జంటలకు పిల్లలు కలిగారని సదరు వైద్యుడు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే దంపతులు కూడా ఇదే మాట చెబుతుండటం విశేషం. దీంతో స్థానిక ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పిల్లలు లేని దంపతులు పెద్ద సంఖ్యలో వచ్చి పసరు మందు తాగివెళ్తున్నారు. ఇదిలా ఉంటే, డాక్టర్లు మాత్రం ఈ పసరు వైద్యంతో పిల్లలు పుడతారనేది అబద్దమని కొట్టి పారేస్తున్నారు. ఇది అపోహా మాత్రమేనని అంటున్నారు. ఇలాంటి పసర్లు తాగితే ఆరోగ్యానికి హాని జరుగుతుందని, అందులో ఎలాంటి వైద్యం లేదనీ, పైగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.