కవ్వాల్ టైగర్ జోన్ లో అన్ని వైపులా గేట్లను ఏర్పాటు చేసి పర్యాటకులను లోపలికి అనుమతించడం లేదు. కవ్వాల్ కోర్ ఏరియా లో ఉన్న పలు ఆలయాలను కూడా మూసివేశారు. జన్నారంలోని జింకల పునరావాస కేంద్రం వద్ద కూడా పర్యాటకులను అనుమతించడం లేదు. కవ్వాల్ అభయారణ్యం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ అడవిలో పెద్దపులులతోపాటు ఇతర వన్య ప్రాణులు కూడా ఉన్నాయి. మహారాష్ట్రంలోని తాడోబా, తిప్పేశ్వర్ అభయరణ్యాల నుండి కవ్వాల్ కు పెద్ద పులుల రాకపోకలు జరుగుతుంటాయి. మనుషుల నుండి జంతువులు, వన్యప్రాణులకు కరోనా వ్యాపించే అవకాశం ఉందన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అటవీ అధికారులు వన్య ప్రాణుల సంరక్షణ కోసం కఠిన ఆంక్షలు విధించారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఇక్కడి అడవుల్లో తునికాకు సేకరిస్తుంటారు. అయితే ఈసారి ఆకు సేకరణను కూడా అనుమతించలేదు.
కరోనా కట్టడిలో భాగంగా ఈ ఆంక్షలను అమలు చేస్తున్నారు. మరోవైపు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కవ్వాల్ అభయారణ్యంలోని పులులతోపాటు ఇతర వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. సాసర్ పిట్లు ఏర్పాటు చేసి నీటిని నింపుతున్నారు.
శాఖాహార జంతువులకు గడ్డి క్షేత్రాలను కూడా పెంచుతున్నారు. మొత్తం మీద కరోనా కట్టడిలో భాగంగా అటవీ అధికారులు కవ్వాల్ అభయారణ్యంపై దృష్టి సారించి వన్య ప్రాణుల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.