Miracle:కరీంనగర్‌లోని ఓప్రైవేట్ ఆసుపత్రి వైద్యసిబ్బంది వినూత్న ప్రయోగం చేశారు. శరీరం చచ్చుబడిన రోగిలో కదలికలు తెచ్చారు. కేవలం సినిమా పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ రోగిలోని మానసీక పరిస్థితిని ఉత్తేజపరిచారు. వైద్యానికి తోడుగా మానసిక వైద్యంతో ఆరోగ్యపరిస్థితిని మరింత మెరుగుపరిచారు.
సంగీతానికి రాళ్లు కరుగుతాయనే మాట ఎంత వరకు నిజమో తెలియదు కాని..రోగాలు తగ్గించవచ్చని వైద్యులు, వైద్య సిబ్బంది రుజువు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కరీంనగర్( Karimnagar)లోని మీనాక్షి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(Meenakshi Super Specialty Hospital)లో శరీర అవయవాలు చచ్చుబడిపోయిన (Declining disease)ఓ రోగిలో వైద్యంతో కాకుండా మానసిక వైద్యంతో మార్పు తెచ్చారు. చెప్పడానికి, వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఇది అద్భుతంగానే చూడాల్సిన విషయం. వాళ్ల ప్రయత్నంలో భాగంగా రికార్డ్ చేసిన వీడియోలే ఇది వాస్తవం అని చూపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా(Peddapalli)సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి(Gollapalli)కి చెందిన శ్రీనివాస్(Srinivas)లివర్ సంబంధిత వ్యాధితో బ్రెయిన్ కు ఆక్సిజన్ అందకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ముందు అతని మానసికస్థితితో పాటు శరీరంలో కదలికలు తేవాలని ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది భావించారు. ఇందులో భాగంగానే సహజ సిద్ధంగా రోగి శ్రీనివాస్ శరీరంలో కదలికలు తేవాలని లేటెస్ట్ సినిమాలోని పాటలకు స్టెప్పులు వేశారు. వాస్తవంగా ఇలా చేస్తే రోగి ఆరోగ్యవంతుడిగా మారతాడని వైద్యశాస్త్రంలో ఎక్కడా చెప్పకపోయినా మీనాక్షి సూపర్ స్టెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న నేటి తరం వైద్య సిబ్బంది ఈ వినూత్న ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. శ్రీనివాస్‌ని 25 రోజుల క్రితం మీనాక్షి సూపర్ స్పెషాలిటీలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్‌కు చికిత్స అందించడంతో ఆరోగ్యం కుదుటపడింది. అయితే కాళ్లు, చేతులు కదపడం వంటి కదలికలు రావాలనే ఉద్దేశంతో ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులు సినిమా పాటలతో డ్యాన్సులు చేయడం ప్రారంభించారు.
అలోపతి వైద్యం కాదు మానసీక వైద్యం..
అతని చేతుల్లో చాలినంత శక్తి లేకపోవడంతో శ్రీనివాస్ మానసిక ధృడత్వం రావాలని అప్పుడే కదలిక ప్రారంభం అవుతుందని భావించి ఈ రకమైన చికిత్స చేయడం ఆరంభించారు. నర్సుల ఆటపాటలతో కొంతమేర కదలికలు కూడా ప్రారంభం కావడంతో పేషెంట్ ను ఐసీయూ నుండి జనరల్ వార్డుకు షిప్ట్ చేసి సహజసిద్ధమైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత క్రమం ప్రకారం ఫిజియో థెరపీ లాంటివి చేయిస్తూ నిదానంలో శ్రీనివాస్ కాళ్లు, చేతుల్లో కదలికలు తెప్పించడమే కాకుండా కళ్లతో చూస్తు వ్యక్తులను గుర్తు పట్టేంతగా సహజమైన వైద్యాన్ని అందించినట్లు ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు.
రాగంతో రోగం మాయం..
గతంలో కూడా బుల్లెట్ బండి పాటకు స్టెప్పులు వేస్తూ ఆసుపత్రి సిబ్బంది విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంలో మాత్రం వైద్య సిబ్బంది కేవలం రోగిలో మానసిక చలనంతో పాటు శరీర కదలికలు తేవాలనే ప్రయత్నం కోసం డ్యాన్స్‌లు చేశారు. పేషెంట్ శ్రీనివాస్ ఆరోగ్యం మరింత మెరుగుపడటంలో ఈ మ్యూజిక్ థెరపీ కొంత మేరకు ప్రభావం చూపిందని నమ్మవచ్చంటున్నారు డాక్టర్లు, రోగి కుటుంబ సభ్యులు.
వినూత్న ప్రయోగం..
సంగీతం, డ్యాన్స్ ప్రజల్ని ఉత్తేజపరిచేవని అందరికి తెలిసినప్పటికి..శరీరం పూర్తిగా చచ్చుబడిపోయిన ఓ రోగిని తిరిగి మాములు మనిషిని చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఇప్పుడే తెలిసింది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.