AS PER CM KCR DIRECTION TRS PUTS ADJOURNMENT MOTION ON TELANGANA PADDY ISSUE IN PARLIAMENT BOTH HOUSES MKS
cm kcr : తొలిరోజే ఆట మొదలైంది! -మోడీ సర్కార్ మెడలు వంచేలా trs వాయిదా తీర్మానాలు
పీఎం మోదీతో సీఎం కేసీఆర్(పాత ఫొటో)
కేంద్రం.. సాగు చట్టాల రద్దు బిల్లులును తోలిరోజే సభలో పెట్టాలని భావిస్తుండగా, రైతు ఉద్యమానికి మద్దతిస్తోన్న టీఆర్ఎస్ మాత్రం తెలంగాణ వరి ధాన్యం వివాదంపై చర్చ కోరుతూ ఉభయ సభల్లో వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది.
తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని, ధాన్యం కొనుగోలు, నీటి వాటాలు, విభజన హామీలపై కేంద్రం మెడలు వంచేలా ఢిల్లీలో గళమెత్తాలని, వరి పోరును ఉధృతం చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను టీఆర్ఎస్ ఎంపీలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దీంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు నుంచే ఆట మొదలైనట్లయింది. నిజానికి కేంద్రం.. సాగు చట్టాల రద్దు బిల్లులును తోలిరోజే సభలో పెట్టాలని భావిస్తుండగా, రైతు ఉద్యమానికి మద్దతిస్తోన్న టీఆర్ఎస్ మాత్రం తెలంగాణ వరి ధాన్యం వివాదంపై చర్చ కోరుతూ ఉభయ సభల్లో వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. తెలంగాణలో పండించిన వరిధాన్యం సేకరణపై స్పష్టత కోసం ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీసేలా గళమెత్తాలని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.
పార్లమెంట్ సమావేశాల వేదికగా కేంద్రంలోని మోదీ సర్కారు మెడలు వంచుతామంటోన్న గులాబీ దళం.. తొలిరోజే యుద్ధానికి సిద్ధమైంది. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. ధాన్యం కోనుగోలు అంశంపై కేంద్రంతో తేల్చుకోనున్నది. ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని ఉభయసభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణలో చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నదని, రూల్ 267 కింద తక్షణమే ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని రాజ్యసభ చైర్మన్‌ను ఎంపీ కేశవరావు డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ శాఖలు ఒకలా, ఎఫ్‌సీఐ మరోలా నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నాయని, అందువల్ల తెలంగాణలో లక్షల టన్నుల ధాన్యం మార్కెట్ యార్డుల్లో మురిగిపోతోందని ఎంపీ కేశవరావు తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పంట సేకరణ విధానం వివక్షపూరితంగా ఉందని, తెలంగాణలో పండిన రబీ పంటను కేంద్రం సేకరించడంలేదని ఆయన ఆరోపించారు. వరి ధాన్యం సమస్యపై పార్లమెంటులో చర్చకు టీఆర్ఎస్ పట్టుపడుతున్న క్రమంలో సభలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందనేది ఉత్కంఠగా మారింది.
ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం మరింత పెద్దదైన నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. పంజాబ్ లో పండే బియ్యం మొత్తాన్ని కొంటోన్న కేంద్రం.. తెలంగాణ బియ్యాన్ని మాత్రం కొనబోమని చెప్పడం దుర్మార్గమని ఆరోపించిన ఆయన.. సమగ్ర జాతీయ ధాన్య సేకరణ విధానం (యూనిఫాం నేషనల్ ఫుడ్‌గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ) కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల్లో డిమాండ్ చేయాలని ఆదేశించారు. ఆహార ధాన్యాల సేకరణలో కేంద్ర ప్రభుత్వ అయోమయ, అస్పష్ట విధానం తెలంగాణ రైతాంగానికి, దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందని, వరిధాన్యం సేకరణపై స్పష్టత కోసం ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు కేసీఆర్ సూచించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.