మంజీరాలో చిక్కుకున్న ఐదుగురు, హెలికాప్టర్‌లో రక్షించిన ఆర్మీ

హెలికాప్టర్‌లో ఐదుగురిని రక్షించిన రెస్క్యూ బృందాలు

మంజీరా నది మధ్యలో చిక్కుకున్న ఐదుగురిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. హెలికాప్టర్ సాయంతో వారిని కాపాడాయి.

 • Share this:
  మూడు, నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు, కుంటలు నిండి ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నాయి. మెదక్ జిల్లా కుల్చారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ పరిధిలోని ఒక సీడ్ ఫామ్ హౌస్‌లో పనిచేసే ఐదుగురు వ్యక్తులు ప్రమాదకర వరద కారణంగా నది మధ్యలో చిక్కుకున్నారు. దీంతో మెదక్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి, మెదక్ జిల్లా ఇంచార్జ్ ఎస్.పి. సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తక్షణమే స్పందించారు. హైదరబాద్ నుంచి ఆర్మీ రెస్క్యూ బృందాన్ని పిలిపించి, జిల్లా పోలీస్ సిబ్బంది సహాయంతో ఐదుగురిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

  గత మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల వల్ల కుల్చారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ పరిధిలోని ఒక సీడ్ ఫామ్ హౌస్ నందు పనిచేసే 5గురు వ్యక్తులు బోయిని నాగరాజు( పైతర గ్రామం), పోతుల శ్రీధర్ (గంగాపూర్ గ్రామం), గుడాల దుర్గా ప్రసాద్ (జానకంపల్లి), సిద్దుల మహేష్(కిష్టాపూర్) మరియు హైదరాబాద్ కి చెందిన కుమారు కొమరయ్యలు పనిలో భాగంగా ఫామ్ హౌస్ వెళ్ళగా, ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా, సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పామ్ హౌస్ కు వెళ్ళే దారిలో వున్న మంజీర నది పాయల బ్రిడ్జి మునిగిపోయింది. వారు బయటకు రాలేక ఇబ్బంది పడ్డారు. ఉదృతంగా మంజీర నది పాయల ప్రవహిస్తుండడంతో విషయం తెలుసుకున్న మెదక్ డి.ఎస్.పి. పి. క్రిష్ణమూర్తి వెంటనే మెదక్ జిల్లా ఇంచార్జ్ ఎస్.పి. డి. జోయల్ డేవిస్ దృష్టికి తీసుకెళ్లారు. మెదక్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్, మెదక్ జిల్లా ఇంచార్జ్ ఎస్.పి. వెంటనే స్పందించి హైదరాబాద్ నుంచి ఆర్మీ రెస్క్యూ బృందాన్ని పిలిపించారు. మెదక్ డి.ఎస్.పి, మెదక్ రూరల్ సి.ఐ. పాలవెల్లి, కుల్చారం ఎస్.ఐ. శ్రీనివాస్ గౌడ్ , ఇతర శాఖ అధికారుల సమన్వయంతో వరదలో చిక్కుకున్న వారిని ఆర్మీ రెస్క్యూ బృందం హెలికాప్టర్ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ సంధర్భంగా మెదక్ జిల్లా ఇంచార్జ్ ఎస్.పి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అప్రమత్తమై ప్రజల ప్రాణాలను కాపాడిన పోలీస్ అధికారులు, ఆర్మీ రెస్క్యూ బృందం, పోలీస్ సిబ్బందిని అభినందించారు. అలాగే పోలీస్ సిబ్బంది, ఆర్మీ రెస్క్యూ బృందం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వరదలో చిక్కుకున్న తమ ప్రాణాలను కాపాడినందుకు ఆ ఐదుగురు కృతజ్ఞతలు తెలిపారు.  మరో ఘటనలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కారు ప్రమాదానికి గురైంది. భువనగిరి సమీపంలో కలెక్టర్ కారును లారీ ఢీకొట్టింది. కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. వలిగొండ మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదానికి గురి కావడంతో మరో కారులో కలెక్టర్ వెళ్లిపోయారు. పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేశారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: