(జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా)
లేరు.. ఇక రారు.. అనుకున్న మావోయిస్టులు (Maoists) వస్తూనే ఉన్నారు. వాళ్ల పని వాళ్లు చేస్తునే ఉన్నారు. ఇప్పటిదాకా కేవలం అటవీ ప్రాంతానికే పరిమితం అయిన మావోల ప్రభావం క్రమేణా మైదాన ప్రాంతానికి విస్తరిస్తోందా..? నిజంగా మావోయిస్టులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారా..? దీనికోసం యాక్షన్ టీంలను (Action team) సిద్ధం చేస్తున్నారా.? అంటే కొట్టి పారేయలేని పరిస్థితి ఉంది. కారణం. రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లా కేంద్రానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కొణిజెర్ల వచ్చినట్టు అలజడి రేగింది. మండల కేంద్రమైన కొణిజెర్ల సర్పంచ్ (Sarpanch) సూరంపల్లి రామారావు ఇంటికి వచ్చిన మావోయిస్టులు తలుపు కొట్టారు. బయటికి వచ్చిన సర్పంచికి మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ (Jagan) పేరిట ఉన్న లేఖను చూపించారు. కారులో కూర్చోవాల్సిందిగా ఆదేశించారు. సాయుధులైన వారి ఆదేశాలను పాటిస్తూనే కారెక్కుతూ లాఘవంగా తప్పించుకుని పక్కనే ఉన్న దుకాణంలోకి పారిపోయిన సర్పంచి రామారావు పై ఆయుధాలు ఎక్కుపెట్టినా కాల్చకపోవడం విశేషం.
కేవలం సర్పంచి రామారావు (ramarao)ను తీసుకెళ్లడానికే వచ్చారా..? ఒకవేళ తమ టార్గెట్ మిస్ అయి ఉంటే ఆయుధాలు ధరించిన మావోయిస్టులు (Maoists) అలా ఊరుకుంటారా..? కేవలం వారికి కిడ్నాప్ చేసి తీసుకురమ్మన్న ఆదేశాలే ఉన్నాయా..? అసలు వాళ్లు నిజమైన మావోయిస్టులేనా... ఒకవేళ కానట్లయితే వారి వద్ద ఆయుధాలెక్కడివి.? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు కనుగొనే పనిలో ప్రస్తుతం పోలీసులున్నారు. ప్రస్తుతం బాధిత ప్రజా ప్రతినిధికి భద్రత ఏర్పాటు చేసినప్పటికీ, అది నిత్యం సాధ్యం కాని పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది. ఇది ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న పెద్ద ప్రశ్న.
ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న ఘటనలు..
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు (Maoists) లేరు. ఇది గత కొన్నేళ్లుగా ఇటు ప్రభుత్వ పెద్దలు, అటు పోలీసు బాస్‌లు చేస్తున్న ప్రకటనలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తీవ్రవాదాన్ని రూపుమాపడంలో విజయం సాధించాం అన్నది గొప్పగా చెప్పుకుంటున్న విషయం. కానీ ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న ఘటనలు మావోయిస్టుల ప్రభావాన్ని, ప్రాబల్యాన్ని చాటి చెబుతునే ఉన్నట్టు తెలుస్తుంది. గత డిసెంబరులో ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలోని వెంకటాపురం మండలం సూరువీడు మాజీ సర్పంచి రమేష్‌ని పోలీసు ఇన్ఫార్మర్ పేరిట దారుణంగా చంపేశారు. తాను ఏ విధంగా పోలీసు ఇన్ఫార్మర్గా మారింది తెలియజేస్తూ అతని వాయిస్ రికార్డును రిలీజ్ చేశారు.
రోడ్డు పనులు పర్యవేక్షిస్తుండగా కిడ్నాప్..
అంతకు ముందు గత నవంబరులో చత్తీస్ఘడ్ బీజపూర్ జిల్లా పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అజయ్ రోషన్ లక్రాను రోడ్ల నిర్మాణ పనులు పర్యవేక్షిస్తుండగా మావోయిస్టులు కిడ్నాప్ (Kidnapped by Maoists) చేశారు. అతని భార్య వేడుకోలు అనంతరం ప్రజాకోర్టు నిర్వహించి, హెచ్చరికలతో వదిలారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి తెలంగాణ- చత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు కూంబింగ్‌లతో మావోయిస్టులను నియంత్రించే ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ.. అడపా దడపా ఎదురుకాల్పులు.. అనంతరం మావోయిస్టుల లొంగుబాట్లు.. చోటుచేసుకుంటున్నా ఉద్యమ విస్తరణ మాత్రం ఆగిపోలేదన్న సంకేతాలను మావోయిస్టులు పంపుతునే ఉన్నారు.
ఎక్కడో ఏజెన్సీలో అటవీ ప్రాంతంలోనే తమ కార్యకలాపాలకు పరిమితం అయిన మావోయిస్టులు ఇప్పుడు ఇలా మైదాన ప్రాంతంలోకి చొచ్చుకుని రావడం, ఒక మండల కేంద్రమైన గ్రామ పంచాయతీ సర్పంచిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం నిజానికి తేలిగ్గా తీసుకునే విషయం కాదు. దీనిపై సీరియస్‌గా స్పందించిన పోలీసులు వచ్చినవాళ్లు ఎవరు..? ఒకవేళ మావోయిస్టులే అయితే వాళ్లు ఇంత లోపలికి ఎలా రాగలిగారు అన్నది తేల్చే పనిలో ఉన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.