Hyderabad - Tree City of the World: హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు.. ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ఎంపిక

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ మహానగరానికి మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా భాగ్యనగరం ఎంపికైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  హైదరాబాద్ మహానగరానికి మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా భాగ్యనగరం గుర్తింపు పొందింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(FAO)తో కలిసి పని చేసే ఆర్బర్ డే ఫౌండేషన్ సంస్థ ఈ గుర్తింపును అందించిందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం హ‌రిత‌హారం కార్యక్రమంలో భాగంగా హైద‌రాబాద్‌లో 2020 ఏడాది వ‌ర‌కు 2.4 కోట్ల మొక్క‌లు నాటిన‌ట్లు ఆర్బ‌ర్ డే ఫౌండేష‌న్ త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు. హరితహారం కార్యక్రమం ద్వారా ఆకుపచ్చగా రూపు దిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరానికి ఈ గుర్తింపు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ రకమైన గుర్తింపు సాధించిన ఏకైక భారతీయ నగరంగా హైదరాబాద్ నిలవడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ప్రపంచంలోని 63 దేశాల నుండి 120 నగరాలు ఎఫ్.ఏ.ఓ, ఆర్బర్ డే ఫౌండేషన్ పరిగణలోకి తీసుకోగా వీటిలో 2020 సంవత్సరానికిగాను 51 నగరాలను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన నగరాలు ఈ జాబితాలో ఉండగా భారతదేశం నుండి ఏకైక నగరం హైదరాబాద్ ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తింపు పొందింది.

  కాగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా కోట్లాది మొక్కలను జిహెచ్ఎంసితో పాటు ఇతర శాఖలు నాటడంతో పాటు వాటి మనుగడకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగించడం, మొక్కల నిర్వహణకు ప్రత్యేక నిబంధనల ఏర్పాటు, మొక్కల ప్రాధాన్యతను తెలియజేయడం, ప్రత్యేక నిధుల కేటాయింపు, చెట్ల పెంపకంపై చైతన్యం పెంచే ఉత్సవాల నిర్వహణ అనే లక్ష్యాలతో హైదరాబాద్ నగరంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు.  గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్, కార్యాలయాలు, విశ్వవిద్యలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన హరితహారం ప్లాంటేషన్ వివరాలను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020 గుర్తింపుకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం హైదరాబాద్ నగరానికి ఈ గుర్తింపునిస్తూ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు ప్రకటించాయి.

  గతంలో కన్నా పెద్ద సంఖ్యలో మొక్కలు, అడవులను పెంచడం ద్వారా హైదరాబాద్ నగరం మరింత ఆరోగ్యకరమైన, నివాసయోగ్యమైన నగరంగా రూపొందడం అభినందనీయమని ఆర్బర్ డే ఫౌండేషన్ అధ్యక్షులు డాన్ లాంబే తన సందేశంలో పేర్కొన్నారు. 2021 మార్చి 1వ తేదిన గాని అంతకుముందేగాని హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ప్రకటించనున్నామని డాన్ లాంబే రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.
  Published by:Nikhil Kumar S
  First published: