ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటిని అందించే జూరాల ప్రాజెక్టు మీద నుండి రాకపోకలను నిషేధిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏపీతో రోజురోజుకు ముదురుతున్న జల వివాదాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే జూరాల ప్రాజెక్టుపై నుండి రాకపోకలు సాగకుండా గేట్లు మూసివేశారు. దీంతో ప్రజలు, వాహనదారులు త్రీవ ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రస్తుతం భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద తెలంగాణ వైపు తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. గత రెండు రోజుల కింద గద్వాల జిల్లా ఎస్పీ రంజన్‌రతన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు జలవిద్యుత్ కేంద్రాన్ని, జూరాల ప్రాజెక్టును సందర్శించారు. వివాదం నెలకొన్న నేపథ్యంలో జూరాలకు భద్రత పెంచినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కృష్ణా జలాల వినియోగంపై కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జూరాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అటు శ్రీశైలం, నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాల్లో వందశాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల మద్య నెలకొన్న జల వివాదం కారణంగా జూరాల మీద పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిపివేయనున్నట్లు సమాచారం. పరిసర ప్రాంతాల వారిని జూరాల మీదుగావెళ్లే వారి ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసినట్లు పరిసర ప్రాంతాల ప్రజలకు తెలిపారు. ఈ సమయంలో ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని తెలిపారు. ప్రాజెక్టు మీద ఉన్న గేట్లను బంద్ చేయడం జరిగింది. అంతేకాక పాలమూరు ఉమ్మడి జిల్లా పరిధిలోగల జూరాల ప్రాజెక్టు మీదుగా ఆంధ్రరాష్ట్రమైన కర్నూలు జిల్లా అతి దగ్గర ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ అధికారులు రాకపోకలను బంద్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రతిరోజు జోగులాంబ గద్వాల జిల్లాలోని మండలాల ప్రజలు- ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆత్మకూర్, అమరచింత, మక్తల్, దేవరకద్ర, మరికల్ ప్రాంతాలనుండి పెద్ద ఎత్తున రాకపోకలు సాగేవి. ఈ ప్రాంతాల గుండా రాయలసీమకు వెళ్లే వాహనాలు సైతం కొన్ని రాకపోకలు సాగించేవి. ఈ క్రమంలో ప్రాజెక్టులకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అటు ఆంధ్ర వైపు 240 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద తెలంగాణ వైపు భారీగా పోలీసులు మోహరించారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద ఆంధ్ర వైపు 140 మంది పోలీసులు మోహరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Telangana border, Irrigation Projects, Nagarjuna sagar, Srisailam Project, Water dispute