Inspiration story : మేం కోవిడ్‌ను గెలిచాం ఇలా .. భయం వద్దు.. ఆత్మ విశ్వాసమే ముద్దు..

మేం కోవిడ్‌ను గెలిచాం ఇలా .. భయం వద్దు.. ఆత్మ విశ్వాసమే ముద్దు..

Inspiration మేం కోవిడ్‌ను గెలిచాం. మీరూ గెలుస్తారు.. ఆ మాటకొస్తే ఎవరైనా గెలుస్తారు.. అందరూ గెలుస్తారు.. 'ఆత్మ విశ్వాసంతో' మాత్రమే. భయానికి లోనైతే మనలో ఉన్న వైరస్‌ రెచ్చిపోయి మనల్ని అంతం చేస్తుంది.. ధైర్యంగా.. ధీమాగా.. జాగ్రత్తగా ఉన్నామా.. తిరుగులేదు.. ఇది వృద్ధాప్యం అంచుల్లో ఉన్న ఓ స్వీట్‌ లవింగ్‌ కపుల్‌ కరోనా కథ

  • Share this:
ఖమ్మం జిల్లా
జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు కరస్పాండెంట్‌

ఖమ్మం నగరంలోని శ్రీరాంహిల్స్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉండే రిటైర్డ్‌ లెక్చరర్‌ ఎల్‌.వి.రావు.. ఆయన సతీమణి సీతామహలక్ష్మి.. ఆమె బీఎస్‌ఎన్‌ఎల్‌లో స్వచ్ఛంధ ఉద్యోగ విరమణ పొందారు. ఉన్న ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు ఆస్ట్రేలియాలోనూ.. మరొకరు గుంటూరులోనూ స్థిరపడగా.. ప్రస్తుతం వీరిద్దరే ఉంటున్నారు. కోవిడ్‌-19 కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎల్‌వీరావు దంపతులపై దాడి చేసింది.

అయితే అందరిలా వారు భయానికి గురికాలేదు. స్థిమితంగా ఇంటి పట్టునే ఉంటూ.. డాక్టర్‌ సూచించిన మందులు వాడుతూ.. మంచి ఆహారం తీసుకుంటూ వైరస్‌పై గెలిచారు. దేశవ్యాప్తంగా నిత్యం లక్షలాదిగా పాజిటివ్‌ కేసులు.. వందలాదిగా మృతులు.. రోజురోజుకూ మ్యుటేట్‌ అవుతూ రెచ్చిపోతున్న వైరస్‌.. మరి ఈ పరిస్థితుల్లో వారేం చేశారు.. కోవిడ్‌ పై ఎలా గెలిచారు.. పాజిటివ్‌ అని తెలిసిన దగ్గరి నుంచి నెగెటివ్‌ అని నిర్థరణ అయ్యే దాకా ఏంచేశారు.. వారి మానసిక స్థితి ఎలా ఉందన్న దాన్ని ఆ దంపతులు 'న్యూస్‌18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధితో పంచుకున్నారు..

వారేం చెప్పారో వారి మాటల్లోనే..

'.. నా మట్టుకు నాకు కోవిడ్‌ కరోనా వైరస్‌ అనేది ప్రాణాంతకం కాదు. కాకపోతే తరచుగా రూపాంతరం చెందే ఓరకమైన ఫ్లూ వైరస్‌ మాత్రమే. మరి ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు భయపడుతున్నారు.. ఎందుకు చనిపోతున్నారంటే కేవలం భయానికి లోనవడం ద్వారా మాత్రమే. వైరస్‌ తమకు పాజిటివ్‌ అని రాగానే.. ఒక్కసారిగా మిన్నువిరిగి మీద పడినట్టు హడలి పోవడం.. బెంబేలెత్తడంతోనే సమస్య వస్తోంది. మనసును స్థిమితపర్చుకోవాలి. నాకు (ఎల్‌వీరావు) ఏప్రిల్‌ 26న కొద్దిపాటి జ్వరం వచ్చింది. 99 నుంచి 101 ఫారన్‌హీట్‌ దాకా రికార్డు అయింది. డాక్టర్‌తో మాట్లాడి ఆయన సలహాతో మరుసటి రోజు నుంచి పారసిట్మాల్‌ వేసుకున్నాను. వరుసగా మూడురోజులు జ్వరం తగ్గని పక్షంలో కోవిడ్‌గా భావించి టెస్ట్‌కు వెళ్లమన్న డాక్టర్‌ సలహాతో ఏప్రిల్‌ 30న నేను మమత ఆసుపత్రిలో టెస్ట్ కు వెళ్లాను. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ లో నెగెటివ్‌ వచ్చినప్పటికీ .. రుచి వాసన పోవడంతో డాక్టర్‌ సలహాతో కరోనా మందుల కోర్సు వాడాను.

ఈ క్రమంలో నేను రికవరీ అవుతుండగానే నా భార్య సీతామహాలక్ష్మికి జ్వరం లక్షణాలు కనిపించడంతో టెస్ట్‌ చేయించా.. పాజిటివ్‌ వచ్చింది. దీంతో తాను కూడా కరోనా వైరస్‌కు వాడే కోర్సు మందులను వాడుతూ పధ్నాలుగు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండిపోయింది. ఇప్పుడు ఇద్దరం బాగున్నాం. ఎవరి సాయం అవసరం పడకుండానే.. బయటపడ్డాం.

ఇర ఆ ఇరవై రోజులూ ఏంచేశామంటే..

కోవిడ్‌ పాజిటివ్‌ అనగానే.. బయటకు వెళ్లకుండా .. ఎవరికీ అంటించకుండా.. ఇంటిపట్టునే హోం ఐసోలేషన్‌లో ఉన్నాం. పండ్లు, టైం టు టైం ప్రోటీన్‌ ఫుడ్‌ తీసుకుంటూ హాయిగా ఇంటిపట్టునే గడిపాం. పుస్తకాలు చదువుకుంటూ.. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూస్తూ.. బంధువులు, స్నేహితులతో ఫోన్లు మాట్లాడుతూ.. అలా అలా ఆ ఇరవై రోజుల హోం క్వారంటైన్‌ ఎలా ముగిసిందో తెలికుండానే పూర్తయింది.

సానుకూల దృక్ఫధంతోనే ఏదైనా సాధించగలం. ఇదేదో గొప్పవిషయం అని నేను చెప్పడం లేదు. ఒక బాధ్యత కలిగిన పౌరునిగా వ్యాధి బారిన పడినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్పిందే. ప్రభుత్వం చేసేది చేస్తుంది. మన వంతుగా మాస్క్‌ పెట్టుకోవడం.. ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించడం.. వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండడం చేయాల్సిందే. అన్నిటికీ మించి ధైర్యంగా ఉండాలి. భయానికి గురయ్యే వార్తలు మనల్ని ఇంకా ఇబ్బందికి గురిచేసే అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. కరోనాకు ఇంట్లో ఉన్నా.. ఆసుపత్రిలో ఉన్నా వాడేది ఆ మందులే. అయితే అవసరం ఉంటే తప్పకుండా ఆసుపత్రికి వెళ్లాల్సిందే. కానీ భయంతో మాత్రం కాదంటూ తమ కరోనా కథను ముగించారు మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ ఎల్‌.వి.రావు.
Published by:yveerash yveerash
First published: