ANOTHER TUSSLE BETWEEN CM KCR AND MODI GOVT AS KTR WRITES NIRMALA SITHARAMAN NOT TO SELL PSU LANDS IN TELANGANA WORTH RS 40K CRORE MKS
CM KCR | Centre : రూ.40వేల కోట్ల తెలంగాణ భూములు అమ్ముకోనున్న కేంద్రం: KTR ఘాటు లేఖ
సీఎం కేసీఆర్, పీఎం మోదీ (పాత ఫొటోలు)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొత్త పంచాయితీ తెరపైకి వచ్చింది. తెలంగాణ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సుమారు రూ.40వేల కోట్ల విలువైన భూమిని మోదీ సర్కార్ అమ్మడానికి వీల్లేదంటూ నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ ఘాటు లేఖ రాశారు..
ప్రభుత్వ భూముల అమ్మకంలో పోటాపోటీగా వ్యవహరించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొత్త పంచాయితీ తెరపైకి వచ్చింది. తెలంగాణ (Telangana) పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు (PSU) చెందిన సుమారు రూ.40వేల కోట్ల విలువైన భూమి (PSU lands)ని మోదీ సర్కార్ అమ్ముకునేందుకు సిద్ధపడగా.. ఆ పని చేయడానికి వీల్లేదంటూ కేసీఆర్ సర్కారు అడ్డుతగిలింది. పెట్టుబడుల ఉపసంహరణ పేరిట.. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మొద్దంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)కు తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) ఘాటు లేఖ రాశారు.
తెలంగాణ అప్పులకు కేంద్రం అడ్డుపడటం, బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో కొత్తగా తెరపైకొచ్చిన భూముల వ్యవహారం రాజకీయాంగానూ సంచలనంగా మారింది.
అంతేకాక, అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం తన పీఎస్ యూల భూములను ఎడాపెడా విక్రయిస్తున్న క్రమంలో ఆయా రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు కూడా టీఆర్ఎస్ చర్య ఊతమిచ్చినట్లయింది. ఏపీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంటును కేంద్రం అమ్మొద్దని, కాదంటే ఆ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగివ్వాలని జగన్ సర్కారు సైతం గతంలో లేఖలు రాయడం తెలిసిందే. తెలంగాణ మంత్రి తాజా లేఖతో పీఎస్ యూ భూముల అమ్మకం వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
అసలు వివాదం ఏంటంటే : తెలంగాణ పరిధిలో కేంద్రం ఆధీనంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలకు భారీగా భూములు, ఆస్తులు ఉన్నాయి. కొంతకాలంగా పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో కేంద్రం.. ప్రభుత్వ రంగ సంస్థల భూములు, ఆస్తులను అమ్ముతున్నది. అయితే, తెలంగాణలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో.. గతంలో కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలు నెలకొల్పాలని, అందుకు వీలు కాకుంటే అదేచోట కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికే ఇవ్వాలని తెలంగాణ కోరుతున్నది. ఇలా కాకుండా తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి ఆస్తులను అమ్మేసి సొమ్ము చేసుకోవాలనుకుంటే కేంద్రాన్ని కచ్చితంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ తన లేఖలో స్పష్టం చేశారు.
భూములున్న సంస్థలు ఇవే :‘‘హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెట్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు గత ప్రభుత్వాలు 7,200 ఎకరాలు ఇచ్చాయి. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి ప్రస్తుత విలువ రూ.5 వేల కోట్లు. మార్కెట్ ధరల ప్రకారం రూ.40 వేల కోట్లు. ఈ సంస్థల భౌతిక ఆస్తులు తెలంగాణ ప్రజల హక్కు. వీటిని ప్రైవేటుపరం చేయడమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్లుగానే మా ప్రజలు భావిస్తారు’’ అని నిర్మలకు రాసిన లేఖలో కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ఎన్నో హామీలను పట్టించుకోకుండా.. రాష్ట్రంలోని సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో వాటి ఆస్తులను అప్పనంగా అమ్ముతోందని ఆయన దుయ్యబట్టారు.
మమ్మల్ని మార్కెట్ రేటు అడిగారుగా: హైదరాబాద్లో ప్రజా రవాణాను సులభతరం చేసేందుకు స్కై వే ప్రాజెక్టులకు భూమి అడిగితే.. మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని కేంద్రం డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు వారికి ఎక్కడుందని నిలదీశారు. తమిళనాడు సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు.. వారిదగ్గరున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పునరాలోచన చేయాలని కేంద్రానికి సూచించారు.
అప్పనంగా అమ్మితే చూస్తూ ఊరుకోం : ‘‘వేలాదిమందికి ప్రత్యక్షంగా, లక్షలమందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్రారంభిస్తే ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయన్న సోయి మోదీ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం. దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన సంస్థలను అప్పనంగా అమ్మడమే వారి లక్ష్యంగా ఉంది’’ అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కథలు చెబుతున్న మోదీ ప్రభుత్వం.. రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంలో మాత్రం తీరిక లేకుండా ఉందని విమర్శించారు. తెలంగాణలో కేంద్రం భూములను అప్పనంగా అమ్మితే చూస్తూఊరుకోబోమని హెచ్చరించారు. మరి కేటీఆర్ లేఖపై కేంద్రం ఏమని బదులిస్తుందో చూడాలి..
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.