శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన విధి అయినప్పటికి సామాజిక బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్న పోలీసు శాఖ (Police Department) ప్రతిష్టకే భంగం కలిగిస్తున్నారు కొంతమంది పోలీసు అధికారులు. రక్షించాల్సిన వారే వేధింపులకు (harassment) పాల్పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొంతమంది పోలీసులపై లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నా వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. లైంగిక వేధింపులకు పాల్పడినందుకు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ (Hyderabad)లో ఓ సీఐ, మరో ఎస్.ఐ సస్పెండ్ కావడంతోపాటు కేసులు నమోదైన ఘటన జరిగి రోజు గడకముందే అదే పోలీసు శాఖలో మరో సబ్ ఇన్ స్పెక్టర్ యువతిని లైంగింకంగా వేధిస్తూ బుక్కయ్యాడు. అయితే ఈ కేసు చివరకు మరో మలుపు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులే మధ్యవర్తిత్వం వహించి కేసు సీరియస్ కాకుండా చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అడవుల జిల్లా… ఆదివాసుల ఖిల్లా… అయిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో (Komurambhim Asifabad District) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
స్టడీ మెటీరియల్ ఇస్తానని..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ కి చెందిన భవాని సేన్ అనే సబ్ ఇన్స్‌స్పెక్టర్ ఓ యువతిని లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు ఆలస్యంగా వెలుగుచూశాయి. సదరు మహిళ ఫిర్యాదు చేయడం తో విచారణ కొనసాగుతుంది. ఇటీవల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నద్దమవుతున్న సదరు యువతిని పలుమార్లు స్టడీ మెటీరియల్ ఇస్తానని చెప్పి పోలీసు స్టేషన్ కు పిలిపించుకున్నాడని, ఆలా వెళ్ళిన యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత యువతి పేర్కొంది.
ఒకసారి కమిట్ అయితే..
ఒకసారి కమిట్ అయితే ఎలాగైనా తనకు ఉద్యోగం వచ్చేలా చూస్తానని చెప్పినట్లు బాధితురాలు పేర్కొంది. అయితే ఈ విషయం బయటకు చెప్పుకునే ధైర్యం లేక ఎవరితోనూ చెప్పుకోలేదని, ఎక్కడ తన భవిష్యత్తుకు భంగం కలిగిస్తాడోనన్న భయంతో ఇన్ని రోజులు ఎవరితో చెప్పుకోలేదని వాపోయింది. వేధింపులు భరించ లేక చివరకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆ యువతి తెలిపింది.
అయితే యువతి ఆరోపణల నేపథ్యంలో సదరు ఎస్.ఐ పై ఇంటలిజెన్స్ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారని తెలిసింది. ఎస్.ఐ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించింది. ఎస్.ఐ. భవాని సేన్ ను రామగుండం కమీషనరేట్ క్ అటాచ్ చేస్తూ, అలాగే భవాన్ సేన్ స్థానంలో రెబ్బెన ఎస్.ఐ గా ఎల్. భూమేష్ ను నియమించారు. కాగా, పోలీసుల భరోసాతో బాధితురాలు ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. గతంలో పనిచేసిన ప్రదేశాల్లో సదరు ఎస్.ఐకి మంచిపేరే ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తన భర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మనస్థాపం చెందిన ఎస్.ఐ భార్య శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, వెంటనే రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళినట్లు తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asifabad, News telugu, Police, Police Case, Sexual harrassment