తెలంగాణలో మరో ఆనందయ్య... కరోనాకు ఆయుర్వేద మందు.. పంపిణీ ఆపిన పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

ఆనందయ్య లాగే బచ్చలి భీమయ్య వైద్యం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోజు రోజుకూ ఆయన వద్దకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో మందమర్రి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని, విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

  • Share this:
    ఆనందయ్య ఆయుర్వేదం.. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తన పూర్వీకుల నుంచి నేర్చుకున్న ఆయుర్వేద వైద్యం ద్వారా కరోనాకు మందు తయారుచేశారు ఆనందయ్య. ఇప్పటి వరకు దాదాపు 80వేల మందికి ఆయుర్వేద ముందును పంపిణీ చేశారు. ఐతే దానికి శాస్త్రీయత లేదని.. పూర్తి అధ్యయనం తర్వాత అనుమతులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ నిలిచిపోయింది. ఐతే ఆనందయ్యలాగే మరికొందరు కూడా కరోనాకు మందు ఇస్తున్నారు. కృష్ణపట్నం తరహాలోనే రాజమండ్రిలోనూ ఓ వ్యక్తి మందును పంపిణీ చేశారు. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి ముందునే ఇస్తున్నారు ఓ సింగరేణి రిటైర్డ్ కార్మికుడు.


    మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రానికి చెందిన బచ్చలి భీమయ్య గతంలో సింగరేణిలో పనిచేశారు. ఆయన పూర్వీకులు ఆయుర్వేద మందులు తయారుచేసి స్థానికులు వైద్యం చేసేవారు. వారి నుంచి వైద్యం నేర్చుకున్న భీమయ్య.. ఇప్పుడు కరోనాకు కూడా మందు తయారుచేశారు. ఆనందయ్యకు తీసిపోని విధంగా కరోనా వచ్చిన వారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మందికి నయం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మాస్క్‌ కూడా ధరించకుడా.. కరోనా రోగులను పక్కన కూర్చోబెట్టుకొని, వారిలో ధైర్యాన్ని నింపుతున్నారని తెలిపారు. బచ్చలి భీమయ్య ఇప్పటి వరకు 100 మందికి పైగా ఆయుర్వేద మందును ఇచ్చినట్లు పేర్కొన్నారు.

    ఆనందయ్య లాగే బచ్చలి భీమయ్య వైద్యం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోజు రోజుకూ ఆయన వద్దకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో మందమర్రి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని, విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏ విధంగా మందును పంపిణీ చేస్తున్నారంటూ ఆరా తీస్తున్నారు. మందును ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఐతే భీమయ్య మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే కరోనా పేషెంట్లకు ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తానని భీమయ్య కూడా చెబుతున్నారు. కాగా, గత 20 ఏళ్లుగా మందమర్రి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రతి ఆదివారం తనకు తెలిసిన వైద్యం అందిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: