రోడ్డు ప్రమాదంలో (Road accident) తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను అక్కున చేర్చుకొని అధైర్య పడవద్దు నేనున్నానంటూ ఆసరగా నిలిచారు దంపతులు. వాళ్లే సామాజిక కార్యకర్త ఇందు ప్రియల్ (Indu Priyal), అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తానా ఉమర్ దంపతులు (MD Sulthana Umar). సిద్దిపేట (Siddipeta) జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామానికి చెందిన బాలమణి-తిరుమలేష్ దంపతులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారికి కూతురు రాజేశ్వరి, కుమారుడు వరుణ్ ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో చిన్నారులు అనాధలుగా మారారు. గురువారం సామాజిక కార్యకర్త సుల్తానా ఉమర్ దంపతులు ఆ చిన్నారులను పరామర్శించి బియ్యం, నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయం అందజేశారు.
ఇలాంటి దుస్థితి ఏ పిల్లలకు రాకూడదని..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాసులాబాద్ గ్రామానికి చెందిన బాలమణి- తిరుమలేష్ దంపతులు ఇద్దరు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో విషాదకరమన్నారు. వారి పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో అనాథలుగా మారారని ఇలాంటి దుస్థితి ఏ పిల్లలకు రాకూడదన్నారు. అల్లారుముద్దుగా ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వయసులో జన్మనిచ్చి పెంచి పోషించిన తల్లిదండ్రులు శాశ్వతంగా దూరం కావడంతో ఆ చిన్నారులకు తల్లిదండ్రులు లేనిలోటు ఎవరు తీర్చలేమని, కానీ వారి చదువులు, బాగోగులు చూసుకోవడానికి మానవతా దృక్పథంతో ముందుకు రావడం జరిగిందన్నారు.
ఇలాంటి చిన్నారులకు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని ఎంత సంపాదించినా లేని తృప్తి ఇలాంటి చిన్నారులకు సహాయం చేస్తే సంతృప్తిగా ఉంటుందని, మానవ జీవితానికి ఆదర్శంగా ఉంటుందన్నారు దంపతులు. ఈ చిన్నారులకు సమాజమే తోడుగా నిలవాలని వారు కోరారు.
కూతురు రాజేశ్వరి ఇటీవల ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిందని తెలిపారు. ఆ ఫలితాలు విడుదలైన రోజునే తల్లిదండ్రులు మృతి చెంది పాసైన ఆనందాన్ని పంచుకోలేక తల్లిదండ్రులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ్ 8 వ తరగతి చదువుతున్నాడని ఇరువురి చదువులకు తమ వంతు సహకారం అందిస్తామని మానవతావాదులు ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి ఈ చిన్నారులకు చేదోడు వాదోడుగా నిలవాలని దంపతులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు మహమ్మద్ ఉమర్, స్థానికులు చార్వాక కుమార్,కిరణ్, రాజేశం, స్వామి,నీలం కుమార్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.