కొమురంభీం ఆసిఫాబాద్ (Kumuram Bheem Asifabad) జిల్లా కాగజ్ నగర్ మండలంలో పెను ప్రమాదం తప్పింది. కాగజ్ నగర్ దహెగాం ప్రధాన రహదారిలో అందవెల్లి గ్రామ సమీపంలో పెద్ద వాగుపై నిర్మించిన వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే మొన్నటి భారీ వర్షాలకు బ్రిడ్జి పిల్లర్లు కుంగిపోవడంతో అధికారులు ఈ వంతెన పై నుండి రాకపోకలను గత కొన్ని రోజుల నుండి నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అందవెల్లి వంతెనకు సంబంధించిన రెండు పిల్లర్లు, మూడు స్లాబులు నేలమట్టం అయ్యాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains)కు ఈ వంతెన కుంగుతూ వస్తోంది. గత సంవత్సరం పెద్దవాగు ఉధృతికి వంతెనకు సంబంధించిన పిల్లర్లు కంగిపోయాయి. ఈ సంవత్సరం మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో మరింత కుంగిపోయాయి.
అందవెల్లి వంతెనకు 10 పిల్లర్లు, 11 స్లాబులు ఉన్నాయి. రెండు నెలల కిందట భారీ వర్షాలు, వరదలతో పిల్లర్లు కంగిపోయాయి. దీంతో అధికారులు ఈ వంతెనపై నుండి రాకపోకలను నిలిపివేశారు. అయితే ఆ తర్వాత మరింతగా కుంగిన వంతెన కుప్పకూలింది. దానికి సంబంధించిన రెండు పిల్లర్లు, మూడు స్లాబులు నేలమట్టం అయ్యాయి. బ్రిడ్జి కూలిపోవడంతో 42 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు గత్యంతరం లేని పరిస్థితిలో తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. కొద్ది రోజుల కిందట విద్యార్థులతో వెళ్తున్న తెప్ప బోల్తాపడింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికి ఏం కాలేదు. ప్రతిరోజు వివిధ పనులపై కాగజ్ నగర్ పట్టణానికి వచ్చే ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతున్నారు. కాగజ్ నగర్ నుండి దహెగాం మండల కేంద్రానికి వెళ్లాలంటే రెండు ఆటోలు మార్చాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Nagarkurnool: ఆందోళనకరంగా ఈ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు: 10 నెలలు, 138 ప్రమాదాలు, 141 మంది మృతి
ఆటోను ఎంగేజ్ చేసుకుంటే ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. దీంతో వారికి ఆర్థికంగా ఎంతో భారం పడుతోంది. ఇక వైద్య సేవలు లేని మారుమూల గ్రామ ప్రజలు మరో మార్గంలో వెళ్లాలంటే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వస్తోంది. ఈ వంతెన పూర్తైతే తప్ప తమ కష్టాలు తీరవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వంతెన కుప్పకులడంతో వంతెన ఇప్పటల్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు.
అసలు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ బ్రిడ్జి వంగిపోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో ఇక్కడి నుండి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా సాగిందని, ఇసుక దొంగలు వంతెన పిల్లర్ వద్దే తవ్వకాలు చేసి ఇసుకను అక్రమరవాణా చేశారని, ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇష్టారీతిన ఇసుక తరలింపుతోనే పిల్లర్ భూమిలోకి కుంగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. త్వరగా పెద్దవాగు పై వంతెన నిర్మాణం చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.