హోమ్ /వార్తలు /తెలంగాణ /

Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రిపై హైకోర్టుకు కమిటీ షాకింగ్​ నివేదిక.. 

Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రిపై హైకోర్టుకు కమిటీ షాకింగ్​ నివేదిక.. 

ఒస్మానియా ఆసుపత్రి

ఒస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆస్పత్రి భవనం ఎంత బలంగా ఉందో తేల్చేందుకు నిపుణుల కమిటీని హైకోర్టు నియమించింది. కాగా, ఈ కమిటీ ప్రభుత్వానికి షాకింగ్​ నివేదికను అందించింది. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. 

  ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) భవనానికి వందేళ్ల చరిత్ర ఉంది . దాని పెద్ద పెద్ద గుమ్మటాల నిర్మాణం, చాలా పెద్దదైన భవన నిర్మాణం ఆనాటి నైజాముల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తూ వచ్చింది. రోజులు గడిచే కొద్దీ దానిని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. మరమ్మతులకు నోచుకోకపోవడంతో పెచ్చులు, పెల్లలు, గోడలు పడిపోతూ ఉండేవి. వాటర్ లీకేజీలు, సీవరేజీ సమస్యలు నిత్యం వెంటాడుతూ ఉండేవి ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని. దాన్ని కాపాడాలంటూ స్వచ్ఛంద సంస్థలు, పలువురు వ్యక్తులు చేసిన పోరాటం ప్రభుత్వం నిర్లక్ష్యం ముందు ఏపాటి కాలేదు.

  ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital)ని అదే భవనంలో కొనసాగించాలని కొందరు.. ఆ భవనంలో వద్దని మరికొందరు కోరుతూ హైకోర్టులో (High Court) ప్రజాప్రయోజన వ్యాజ్యాలు(పిల్‌లు) దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. గతంలో హైకోర్టు.. ఉస్మానియా ఆస్పత్రి భవనం ఎంత బలంగా ఉందో తేల్చేందుకు నిపుణుల కమిటీని నియమించింది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీలు, జీహెచ్‌ఎంసీ సిటీ ప్లానర్‌లతో కమిటీ వేసింది. వరంగల్‌ ఎన్‌ఐటీ నిపుణుల సాయంతో ఆస్పత్రి భవనాన్ని గత మార్చి 19న పరిశీలన, పరీక్షలు నిర్వహించింది.

  ఈ నేపథ్యంలో కమిటీలో అందరూ స్టేట్‌ ఆఫీషియల్స్‌ ఉండటంతో హైదరాబాద్‌ ఐఐటీ ప్రొఫెసర్, ఆర్కెయాలజీ ఆఫ్‌ ఇండియా ఎస్‌ఈ, స్టెడ్రంట్‌ టెక్నోకక్లినిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు స్థానం కల్పించింది. కాగా, ఈ కమిటీ షాకింగ్​ నివేదికను అందించింది. దీనిపై కోర్టులో విచారణ జరిగింది.  ‘హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి భవనం ప్రమాదకరంగా ఉంది. ఇప్పడున్న పరిస్థితుల్లో ఆస్పత్రి కొనసాగింపునకు పనికిరాదు. పునరుద్ధరణ, మరమ్మతులు చేస్తే భవన జీవితకాలం కొన్నేళ్లు పెంచొచ్చు. ఆ తర్వాత ఆస్పత్రి (Osmania Hospital) కాకుండా ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. వారసత్వ భవన జాబితాలో ఉన్న నేపథ్యంలో నిపుణుల పర్యవేక్షణలో రక్షణ చర్యలు తీసుకోవచ్చు. ఆక్సిజన్‌ పైప్‌లైన్లు, గ్యాస్‌ లైన్లు, ఏసీలు, వాటర్‌ పైప్‌లైన్ల లాం టివి ఏర్పాటు చేస్తే దాని భవన ధృడత్వం మరింత దెబ్బతింటుంది’.. అని కమిటీ  నివేదిక ఇచ్చింది .

  హైకోర్టు పరిశీలనకు..

  ఉస్మానియా ఆస్పత్రి భవనంపై నిపుణులు ఇచ్చిన నివేదికను హైకోర్టు పరిశీలించింది. అయితే ఈ రిపోర్టును అధ్యయనం చేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ ఏజీ హైకోర్టును కోరారు. ఏజీ అభ్యర్థనను అంగీకరించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం... నివేదికపై అధ్యయనం తర్వాత విచారణ చేపడతామని చెప్పింది. విచారణను వచ్చే నెల ఆగస్టు 25కి వాయిదా వేసింది హైకోర్టు. గతేడాది భారీగా కురిసిన వానలతో ఆస్పత్రిలోకి వాన నీరు వచ్చి చేరింది. రోగులున్న వార్డులో నీరు నిలిచిపోయింది. అందులోనే నడుస్తూ వైద్యులు రోగులకు చికిత్స అందించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతోనూ ఉస్మానియా ఆస్పత్రిలోకి నీళ్లు వస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనంలో ఉండేందుకు వైద్యులు, రోగులు జంకుతున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Highcourt, Hospitals

  ఉత్తమ కథలు