AMID DIFFERENCES WITH CM KCR TS GUV TAMILISAI REMARKS OVER DISCRIMINATION ON INTERNATIONAL WOMENS DAY MKS
Women's day 2022: నన్నెవరూ భయపెట్టలేరు: CM KCRతో విభేదాల క్రమంలో గవర్నర్!
గవర్నర్, సీఎం
మహిళా దినోత్సవం సందర్భంలోనూ సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై అన్నట్లుగా కార్యక్రమాలు జరగడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై.. ఉన్నత పదవుల్లోనూ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను ప్రస్తావించారు..
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ గవర్నర్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ వివాదం కొనసాగుతున్నది. రాజ్ భవన్ కాషాయమయం అయిపోయిందంటూ టీఆర్ఎస్ నేతలు బాహాటంగా విమర్శిస్తుంటం, దానిపై గవర్నర్ కార్యాలయం ఖండనలు వెలువడటం పరిపాటిగా మారింది. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన వైనం రెండు వ్యవస్థల మధ్య విభేదాలను మరింత ప్రస్పుటం చేశాయి. గవర్నర్ నేరుగా సర్కారును విమర్శిస్తే, ప్రభుత్వం లీకుల రూపంలో కౌంటరిచ్చింది. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంలోనూ సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై అన్నట్లుగా కార్యక్రమాలు జరగడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై.. ఉన్నతపదవుల్లోనూ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా కేసీఆర్ను హెచ్చరించినట్లున్నాయనే వాదన వినిపిస్తోంది..
గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య విభేదాల క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భం పోటాపోటీగా మారింది. సోమవారం సాయంత్రం రాజ్ భవన్ లో కార్యక్రమాన్ని తలపెట్టి, మంత్రులనూ ఆహ్వానించారు గవర్నర్. కానీ అదే సమయంలో సీఎం నివాసం ప్రగతి భవన్ లో జరిగిన మహిళా బంధు వేడుకలో పాల్గొన్నారు మంత్రులంతా. గవర్నర్ నెలకొన్న విబేధాల నేపథ్యంలోనే కేసీఆర్ పంతానికి పోయి ఈ స్పెషల్ ఈవెంట్ నిర్వహించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి కొనసాగింపుగా గవర్నర్ వ్యాఖ్యలున్నాయి..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళలను గవర్నర్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్నా రావాల్సిన గుర్తింపు రావట్లేదని, పైగా అవమానాలు ఎదురవుతున్నాయని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కట్లేదని, అత్యున్నత పదవుల్లోని వాళ్లూ గౌరవం పొందట్లేదన్నారు. అంతేకాదు,
సమాన హక్కుల కోసం మహిళలంతా ఒకవైపు డిమాండ్ చేస్తుంటే అన్ని స్థానాల్లో, చివరకు ఉన్నత పదవు ల్లోని మహిళలూ ఇంకా వివక్షకు గురవుతున్నారని, అయితే తననెవరూ భయపెట్టలేరని, తాను దేనికీ భయపడబోనని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. మహిళా రక్షణ, లింగ సమానత్వంతో వారు పని చేసే వాతావరణం కల్పించాలని కోరారు. మహిళలు సాధించిన అద్భుత విజయాలను గుర్తు చేసుకొని వారిని గుర్తించడం మహిళా దినోత్సవం ఉద్దేశమని గవర్నర్ అన్నారు. రాజ్ భవన్ లో జరిగిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. అయితే, టీఆర్ఎస్ మహిళా మంత్రులు గైర్హాజరుకాగా, బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురూ హాజరయ్యారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.