Khammam muncipal elections : మీటరు దూరం.. మాస్క్..తప్పనిసరి

ఖమ్మం ఎన్నికలపై పోలీసు సిబ్బందికి శిక్షణ

Khammam muncipal elections : ఖమ్మం మున్సిపోల్స్‌కు ఏర్పాట్లు సిద్ధం.. కోవిడ్‌ నిబంధనల మేరకు.. మాస్క్‌తో పాటు మీటరు దూరం తప్పనిసరి.. ఖమ్మలో పురుష ఓటర్ల కంటే మహిళ ఓటర్లే ఎక్కువ...

  • Share this:
ఖమ్మం మున్సిపోల్స్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోవిడ్‌ నిబంధనల మేరకు అందరూ సురక్షితంగా తమ ఓటు హక్కను వినియోగించుకోడానికి రంగం సిద్ధం చేశారు. మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలోని మొత్తం అరవై డివిజన్లలో 2,81,100 మంది ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగించుకోనున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 800 మంది ఓటు వేసేలా ఇప్పటికే 376 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. ఓటు వేయాలంటే తప్పనిసరిగా మాస్కు ధరించాలని.. మీటరు దూరం పాటించాలన్న నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు. వేసవి దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచనున్నారు. పురుషులకు, మహిళలకు, దివ్యాంగులకు, వృద్ధులకు, గర్భిణులకు, బాలింతలకు.. ఇలా ఎవరి క్యూ లైన్‌ వారికే ఏర్పాటు చేస్తున్నారు.

వాస్తవానికి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 252 పోలింగ్‌ కేంద్రాలే ఉండగా.. కోవిడ్‌ దృష్ట్యా వాటి సంఖ్యను 376కు పెంచారు. దాదాపు అన్ని పోలింగ్‌ స్టేషన్లలో సగటున 800 ఓటర్లు మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికలు సజావుగా సాగడం కోసం మొత్తం 2500 మంది సిబ్బందిని నియమించారు. వీరికి అవసరమైన శిక్షణ పూర్తయింది. పోలింగ్‌ అనంతరం బాక్సులను స్థానిక ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో వచ్చే నెల 3వ తేదీన కౌంటింగ్‌ చేపట్టనున్నారు. కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేశారు.

మొత్తంమీద ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమంటే.. ఖమ్మం మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల ఓటర్లలో 48 శాతం మంది పురుషులు కాగా.. మిగిలిన 52 శాతం మంది మహిళలు ఉండడం విశేషంగా ఉంది.
దీంతో ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మహిళల పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది అందరికీ కోవిడ్‌ కిట్లను సైతం అందిస్తున్నారు. శానిటైజేషన్‌, మాస్కులు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లను కలెక్టర్‌ కర్ణన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి పర్యవేక్షిస్తున్నారు.

భారీ బందోబస్తు నడుమ.. మున్సిపల్‌ ఎన్నికలు సజావుగా జరగడానికి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడానికి ఇప్పటికే పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ పలుమార్లు సమీక్షలు నిర్వహించారు.

ఎన్నికల కోసం మొత్తం 1700 మంది సిబ్బందిని నియోగిస్తున్నారు. హైపర్‌ సెన్సిటివ్‌గా పరిగణించే పోలింగ్‌ కేంద్రాలు 17 ఉండగా.. సెన్సిటివ్‌గా పరిగణించే కేంద్రాలు 50 ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఏసీపీలు తొమ్మిది మంది, 14 మంది సీఐలు, 43 మంది ఎస్సైలు, ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు 180 మంది, కానిస్టేబుళ్లు 792 మంది, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు 349 మంది, ఆర్మ్డ్‌ ఫోర్స్‌ 104 మందితో పాటు ఇంకా తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ ప్లటూన్లు అందుబాటులో ఉంచారు. కాగా ఎన్నికల ప్రక్రియలో కోవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్‌ కర్ణన్‌ ఆదేశించారు.
Published by:yveerash yveerash
First published: