news18-telugu
Updated: October 28, 2020, 9:34 AM IST
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అలర్ట్... టైమింగ్స్ మారాయి
(image: Hyderabad Metro)
ప్రస్తుతం మెట్రో రైళ్లు నడుస్తున్న సమయం కన్నా మరో అరగంట ఎక్కువ సేపు రైళ్లు నడపాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. అంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం రాత్రి 9 గంటల వరకే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. రాత్రి 10 గంటల వరకు మెట్రో రైళ్లు నడపాలన్న డిమాండ్లు ప్రయాణికుల నుంచి వస్తున్నాయి. కరోనా సంక్షోభం కన్నా ముందు మెట్రో రైళ్లు రాత్రి 10 గంటల వరకు నడిచేవి. గతంలో నడిపినట్టుగా మెట్రో రైళ్లను 10 గంటల వరకు నడపాలని ప్రయాణికులు మెట్రో అధికారులను కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రయాణికుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న అధికారులు మరో అరగంట సమయాన్ని పొడిగించారు. అక్టోబర్ 28 నుంచి రాత్రి 9.30 గంటల వరకు రైళ్లు నడపాలని నిర్ణయించారు.
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా మెట్రో సేవలు మార్చి 22న నిలిచిపోయాయి. సుమారు ఐదున్నర నెలలు మెట్రో రైళ్లు తిరగలేదు. ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్ వచ్చిన తర్వాత మళ్లీ మెట్రో రైళ్లు పరుగులు తీశాయి. సెప్టెంబర్ 7న మెట్రో రైళ్ల సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే మొదట మూడు కారిడార్లలో కొద్ది సేపు మాత్రమే ఈ రైళ్లు నడిచేవి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో రైళ్లు తిరిగేవి. ఆ తర్వాత ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రైళ్లను నడుపుతున్నారు. ఇప్పుడు మరో అరగంట పొడిగించి రాత్రి 9.30 గంటల వరకు మెట్రో రైలు సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతీ మూడు నిమిషాలకు ఓ రైలు అందుబాటులో ఉంటుంది.
ఇక ఇటీవల హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త స్మార్ట్ కార్డ్ తీసుకున్న వారికి ప్రతీ ట్రిప్పై 50 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అక్టోబర్ 17న మొదలైన ఈ ఆఫర్ 2021 జనవరి 16 వరకు ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి మెట్రో రైల్వే స్టేషన్లలో అనేక చర్యల్ని తీసుకుంటున్నారు హైదరాబాద్ మెట్రో అధికారులు. థర్మల్ స్క్రీనింగ్, సోషల్ డిస్టెన్సింగ్ లాంటి నియమనింధనలు పాటిస్తున్నారు. మెట్రో రైల్వే స్టేషన్లలో హ్యాండ్ శానిటైజర్ అందుబాటులో ఉంటుంది.
Published by:
Santhosh Kumar S
First published:
October 28, 2020, 9:34 AM IST