Home /News /telangana /

AITUC CENTENARY YEAR CELEBRATIONS HELD IN KHAMMAM WITH HIGH JOSH BA KMM

AITUC: ఏఐటీయూసీ శతవార్షికోత్సవాలు.. ఖమ్మంలో ఎర్రజెండా రెపరెపలు

ఖమ్మంలో AITUC శత వార్షికోత్సవాల ర్యాలీ

ఖమ్మంలో AITUC శత వార్షికోత్సవాల ర్యాలీ

భారతదేశంలోని కార్మిక సంఘాలకు ఏఐటీయూసీ తల్లి లాంటిదని కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రతి కార్మిక హక్కు ఏఐటీయూసీ సంతకంతోనే సిద్ధించిందని తెలిపారు.

  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్‌18)

  భారతదేశంలో సమరశీల పోరాటాల చరిత్ర ఏఐటీయూసీదేనని యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు టి. నరసింహాన్ అన్నారు. కార్మిక వర్గానికి ఉద్యమ ఓనమాలు నేర్పిన చరిత్ర ఏఐటీయూసీ సొంతమన్నారు. ఏఐటీయూసీ శత వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఖమ్మం నగరంలో భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పెవిలియన్ మైదానం నుంచి ఆటోలు, మోటార్ సైకిళ్లతో, భారీ ర్యాలీ నిర్వహించారు. మయూరి సెంటర్, జెర్చి సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్డు మీదుగా పర్ణశాల వరకు కొనసాగింది. స్థానిక సిటీ కన్వెన్షన్ హాల్ నుంచీ వందలాది మంది కార్మికులతో ప్రదర్శన నిర్వహించారు. 100 ఏళ్ల ముగింపు ఉత్సవాల సందర్భంగా 100 మీటర్ల జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అగ్రభాగాన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, బిజి క్లెమెంట్, శింగు నర్సింహారావు, గాదె లక్ష్మీనారాయణ పలువురు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నడవగా అరుణ పతాక రెపరెపలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

  పైలాన్ ఆవిష్కరణ..
  ఏఐటీయూసీ శత వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా పైలాన్ ను ఏర్పాటు చేశారు. పైలాన్ను సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, ఏఐటీయూసీ పతాకాన్ని టి. నరసింహాన్ ఆవిష్కరించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు, బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, శింగు నర్సింహారావు, బిజి క్లెమెంట్, గాదె లక్ష్మి నారాయణ, గాంధీ పాల్గొన్నారు.

  AITUC శతవార్షికోత్సవాల సందర్భంగా పైలాన్ ఆవిష్కరణ


  అనంతరం సిటీ కన్వెన్షన్ హాల్ లో గాదె లక్ష్మినారాయణ అధ్యక్షతన జరిగిన సభలో నరసింహన్ మాట్లాడుతూ అనేక దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులను మోదీ సర్కార్ హరించివేస్తుందన్నారు. దేశభక్తి గురించి మాట్లాడే హక్కు, అర్హత ప్రధాని నరేంద్ర మోదీకి లేదన్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని నరసింహాన్ ఆరోపించారు. విదేశీ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్న మోదీ కంటే దేశ ద్రోహి మరొకరు లేరన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించేందుకు ప్రత్యేక మంత్రివర్గ శాఖలను ఏర్పాటు చేశారంటే ఆయన దేశభక్తి గురించి తెలుసు కోవచ్చునన్నారు. పోరాడేందుకు జీవించాలని, జీవించేందుకు పోరాడాలని నరసింహాన్ పిలుపు నిచ్చారు. మోదీకి తమ్ముడిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు.

  ఖమ్మంలో AITUC శత వార్షికోత్సవాల ర్యాలీలో పాల్గొన్న ఆటోవాలాలు


  అసహనం పెరుగుతుంది: పువ్వాడ
  మోదీ పాలనలో దేశంలో అసహనం పెరుగుతుందని సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ఆరోపించారు. ఏఐటీయూసీ శత వార్షికోత్సవాల ముగింపు సభలో పువ్వాడ మాట్లాడుతూ పెట్టుబడిదారి సమాజంలో శ్రమకు విలువ రాను రాను తగ్గిపోతుందన్నారు. నంపద నృష్టికర్తలు ఇప్పుడు వీధినపడే పరిస్థితులు దాపురించాయని పువ్వాడ ఆరోపించారు. పాలకుల విధానాలు దేశంలో ఆర్థిక అంతరాలను సృష్టిస్తున్నాయన్నారు సంపద కొందరి చేతుల్లో పోగుబడుతుందని ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు. 1920లో స్థాపించిన ఏఐటీయూసీ అనేక చారిత్రక పోరాటాలకు నాయకత్వం వహించిందన్నారు. కార్మిక వర్గం అనుభవిస్తున్న ప్రతి హక్కు ఏఐటీయూసీ పోరాట ఫలితమేనన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో కార్మిక వర్గం త్యాగాలకు, బహుముఖ పోరాటాలకు సిద్ధం కావాలని పువ్వాడ పిలుపునిచ్చారు.

  పోరాటాల మార్గదర్శి ఏఐటీయూసీ : కూనంనేని
  భారతదేశ కార్మికోద్యమాలకు మార్గదర్శి ఏఐటీయూసీ అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఏఐటీయూసీ శత వార్షికోత్సవాల ముగింపు సభలో కూనంనేని మాట్లాడుతూ ఆది నుంచి బలవంతుడిదే రాజ్యమని, వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు పుట్టిన సంఘమే ఏఐటీయూసీ అన్నారు. భారతదేశంలోని కార్మిక సంఘాలకు ఏఐటీయూసీ తల్లి లాంటిదన్నారు. పాలకుల నిర్లక్ష్య విధానాలతో అణచివేయబడిన గొంతుల నినాదమే ఏఐటీయూసీ జెండా అని కూనంనేని తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసం పోరాడి అనేక త్యాగాలు చేసిన ఘన చరిత్ర ఏఐటీయూసీ సొంతమన్నారు. బహుముఖ పోరాటాల ద్వారా హక్కులు సాధించడం జరిగిందని ప్రతి కార్మిక హక్కు ఏఐటీయూసీ సంతకంతోనే సిద్ధించిందని కూనంనేని తెలిపారు. ప్రజాహితం కోసమే ఎర్రజెండా అవతరించిందని ఎర్ర జెండా నీడన పోరాడుతున్న ఏఐటీయూసీ మరో 100 ఏళ్లయినా కార్మికుల పక్షాన పోరాడే ఏకైక సంఘం ఏఐటీయూసీ మాత్రమేనన్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Khammam, Telangana

  తదుపరి వార్తలు