Polavaram project : పోలవరం ఓకే.. మరి భద్రాద్రి ముప్పు సంగతేంటి..? ఈ ప్రాంత వాసుల్లో పెరుగుతున్న ఆందోళనలు..!

పోలవరం ఓకే.. మరి భద్రాద్రి ముంపు సంగతేంటి..? ఈ ప్రాంత వాసుల్లో పెరుగుతున్న ఆందోళనలు..!

Polavaram project : పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాద్రికి ముప్పు పొంచి ఉందా..? సబ్‌మెర్జెన్స్‌ ఏరియాలో ఉన్న దాదాపు వంద ఊళ్ల సంగతేంటి...? దీనిపై ఇప్పటికే నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో ఉన్న కేసుల సంగతేంటి..? అసలు ఈ సబ్‌మెర్జెన్స్‌ తీవ్రతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ అంచనా ఉందా..? అసలు ఆ వైపుగా ఏదైనా స్టడీ చేశారా..?

  • Share this:
జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా

పోలవరం నిర్మాణపై పలు ప్రశ్నలన్నింటికి సమాధానం లేదనే చెప్పాలి. కానీ ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న లక్షలాది మందికి ఇవన్నీ ఇప్పుడు వెంటాడుతున్న పలు రకాల ప్రశ్నలు. వాటికి సమాధానం చెప్పాల్సిన వాళ్లు పట్టించుకోని దుస్థితి. దీనిపై ఇప్పుడిప్పుడే ఆందోళనలు మొదలవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యాం పూర్తవుతున్న దశలోనే గోదావరి వరదల మూడో ప్రమాద హెచ్చరిక చేసే స్థాయి (53 అడుగుల మేర ప్రవాహం) లోనే అనేక గ్రామాలు ప్రమాదానికి దరిదాపుల్లోకి వెళ్లాయి. ప్రభుత్వ యంత్రాంగం ఆ కాసేపు ఊరటగా పనిచేయడం తప్ప అసలు పోలవరం పూర్తయితే.. గరిష్టంగా నీటిని నిల్వ చేస్తే.. ఆ సమయంలో గోదావరి వరదలు వస్తే ఎక్కడ.. ఏ స్థాయిలో మునక ఉంటుందన్న దానిపై ఎలాంటి క్షేత్ర స్థాయి స్టడీ జరగలేదన్నది పెద్ద ప్రశ్న.

దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంగానీ.. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న కసితో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కానీ.. మునక ప్రాంతం ఎక్కువగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం గానీ.. పాక్షికంగా ఉన్న ఒడిషా గానీ దీనిపై పెద్దగా దృష్టి సారించిన దాఖలా లేదు. దీంతోనే ఈ ప్రాంత వాసుల్లో ఆందోళన అధికమవుతోంది.

వాస్తవానికి పదేళ్లకు పైగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పట్ల ఎవరికీ వ్యతిరేకత లేదు. విస్త్రృతమైన ప్రయోజనాల కోసం నిర్మించే బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో కొంతమేర ప్రజలు నిర్వాసితులు కావడం సహజం. కానీ దాని తీవ్రతను సరిగా అంచనా వేయలేదన్న దానిపై ఇప్పుడు ఈ ప్రాంతవాసులు గళం విప్పుతున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు 2005లోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి భూమిపూజ చేసి నిధులు విడుదల చేశారు. భూసేకరణ కూడా అప్పట్లోనే మొదలైంది. ఆయన మరణం తర్వాత పరిణామాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేదు. నిధులు సైతం విడుదల చేయలేదు. నిజానికి 2014 ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో సైతం దీన్ని కేంద్రం ప్రస్తావించింది. నిధులు ఇచ్చి ఆ ప్రాంతాన్ని ఆదుకుంటామని.. ప్రాజెక్టు పూర్తిగా పూర్తిస్థాయిలో సహకరిస్తామని పేర్కొంది. దీన్లో భాగంగానే పూర్వపు ఖమ్మం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను పూర్తిగా, భద్రాచలం, బూర్గంపాడు మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు.

ఇక తెలంగాణ సాధన మాత్రమే లక్ష్యంగా ఉన్న అప్పటి ఉద్యమనేత, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పరిణామాలను తీవ్రంగా తీసుకోలేదు. దీంతో కేంద్రం భావించినట్టు, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాల అమలులో ఎలాంటి అవాంతరం తలెత్తలేదు. అయితే దక్షిణాది ఆయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీసీతారాముల ఆలయంతో బాటు, ఈ ప్రాంతంలో ఉన్న సింగరేణి గనులు, ప్రతిష్టాత్మకమైన హెవీవాటర్‌ ప్లాంట్‌, ఇంకా అనేక పవర్‌ ప్లాంట్లకు నీటిమునక ముప్పు ఉందన్నది ఈ ప్రాంతవాసుల ఆందోళన. దీనిపై ఇప్పటికే అనేకమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నించుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి.

ఇప్పటికే దాదాపు వందేళ్లుగా నలుగుతున్న ఈ విషయమై తాజాగా మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ పరిశీలకుడు (తమిళనాడు) పొంగులేటి సుధాకరరెడ్డి ప్రధాని నరేంద్రమోడికి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖలు రాశారు. ఈ విషయమై ఆయన 'న్యూస్‌18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధితో మాట్లాడుతూ తాను గతంలోనూ, ఇప్పుడు కూడా ఈ విషయమై కేంద్రం వద్ద ప్రస్తావిస్తూ ఉన్నానన్నారు. తాను పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, సబ్‌మెర్జెన్సీ లో ఉన్న ప్రాంతాలు, ఊళ్లు, ప్రజలు, ఆస్తులు, కోట్లాది మంది విశ్వాసానికి నిలయమైన భద్రాద్రి సీతారాముల ఆలయం లాంటి వాటిపై క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నానన్నారు. ఈ విషయంలో తాను ఇప్పటికే నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కేసు వేశానని, దానిపై లోతుగా అధ్యయనం చేయమని కోరామన్నారు.
Published by:yveerash yveerash
First published: