(K.Lenin,News18,Adilabad)
ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad)జిల్లాలోని ఆదివాసి గిరిజనుల ఆచార వ్యవహారాలు మిగతావారికి భిన్నంగా ఉంటాయి. వారి నమ్మకాలు విశ్వాసాలు కూడా అంతే. అడవులు, గుట్టల మధ్య గూడెల్లో ఉండే ఇక్కడి ఆదివాసి గిరిజనులకు భక్తి కూడా మెండుగానే ఉంటుంది. క్రమం తప్పకుండా వారి పండుగలను, వేడుకలను జరుపుకోవడం మాత్రం మానరు. తాత తండ్రుల కాలం నుండి వస్తున్న ఆచార వ్యవహారాలను తూచ తప్పకుండా పాటిస్తారు. సంస్కృతి (Cultural) సంప్రదాయాల(Traditions)కు పెద్దపీఠ వేసే గిరిజనులు(Tribal people)పుష్య మాసంలో తమ ఆరాధ్య దైవాలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడమే కాకుండా జాతరలు, ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం..
గిరిజనుల్లోని ఒక్కో తెగ ఒక్కో ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుంటుంది. అందులో ఖాందేవుని జాతర ఒకటి. ఆదివాసి గిరిజనుల్లోని తొడసం వంశస్థుల ఆరాధ్యదైవం ఈ ఖాందేవుడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ఖాందేవుని ఆలయంలో ప్రతి సంవత్సరం పుష్యమాసంలో ఘనంగా జాతరను నిర్వహిస్తారు. తొడసం వంశీయుల మహాపూజతో ఈ ఉత్సహం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఖాందేవుని వద్ద తొడసం కటోడలు(పూజారులు) ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించారు. యేటా నిర్వహించే ఆనవాయితీ ప్రకారం ఈ యేడు కూడా తొడస వంశ ఆడపడుచుతో నూనె తాగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జివితీ తాలుకా కొద్దేపూర్ గ్రామానికి చెందిన తొడసం వంశస్తుల ఆడపడుచు మెస్రం నాగుబాయి రెండున్నర కిలోల నువ్వుల నూనెను తాగి దైవభక్తిని చాటుకుంది. అనంతరం ఆలయ సభ్యులు ఆమెను సత్కరించారు.
అడవి బిడ్డల ఆచారం..
తొడసం వంశ ఆడ పడుచు మెస్రం నాగుబాయి విశ్వశాంతి కోరుతూ రెండున్న కిలోల నువ్వుల నునే తాగి జాతరను ప్రారంభించారు. కాగా తొడసం వంశంలోని ఒక ఆడపడుచు ఇలా మూడేళ్లు ఏటా తైలం తాగడం ఇక్కడ ఆనవాయితీగా నడుస్తుంది. గత మూడేళ్ళు మడావి ఎత్మబాయి రెండు కిలోల నునే తాగగా ఈ సారి మొదటిసారి మేస్రం నాగుబాయి నునే తాగి జాతరను ప్రారంభించింది. ప్రతిఏటా పుష్య పౌర్ణమి సందర్భంగా మరుసటి రోజు ఉదయం తొడసం వంశ ఆడపడుచు ఉపవాసాలతో దేవుని వాకిట్లో కూర్చొని, ఇంట్లో తయారు చేసిన నువ్వుల నునేను తాగుతారు. ప్రజలు సుఖసంతోషాలతో మెలగాలని, రైతులకు అధిక పంటలు పండాలని వేడుకోవడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. అయితే తొడసం వంశ ఆడపడుచు మూడు సంవత్సరాలపాటు నూనె తాగే వ్రతాన్ని తీసుకొని పూర్తిచేస్తుంటారు.
విశ్వశాంతి కోసమే ఇదంతా..
ఈ ఆచారం 1961లో ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు 20 మంది తొడసం ఆడపడుచులు ఈ వ్రతాన్ని పూర్తి చేశారు. 21వ వ్రతాన్ని మెస్రం నాగుబాయి పూర్తిచేసింది. ఈసారి ఈ అవకాశం తనకు దక్కడం పట్ల ఆమె అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఖాందేవుడికి పూజలు చేస్తే అడవిలోని వన్య ప్రాణులను రక్షిస్తాడని, ప్రజల శాంతియుత జీవనానికి దోహదపడతాని తొడసం వంశ కటోడలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ శాసన సభ్యుడు ఆత్రం సక్కు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆదివాసి గిరిజనుల సంస్కృతీ సాంప్రదాయాలకు నిలయమైన దేవాలయాల అభివృద్ది కోసం తామంతా కృషి చేస్తామన్నారు. ఈ జాతరకు తెలంగాణ , మహారాష్ట్ర లోని వివిధ గ్రామాల నుండి తొడసం వంశస్థులు, ఇతర ఆదివాసీ గిరిజనులు, భక్తులు తరలివస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Telangana News