(Adilabad, news 18 telugu, K.Lenin)
పలు రకాల లోడ్లతో భారీ వాహనాలు గ్రామీణ ప్రాంతాల మీదుగా వెళ్ళడం, అతివేగంగా వాహనాలను తోలడంతో అంతర్గత రహదారులు దెబ్బతింటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. భారీ వాహనాల రాకపోకలతో అక్కడక్కడ ప్రమాదాలు చోటుచేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కేంద్రంలోనూ ఓ ప్రమాదం చోటుచేసుకొని ఓ ప్రాణి జీవిడిచిన సంఘటన జరిగింది. ఈ ఘటనతో ఉద్రిక్తత కూడా నెలకొంది.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానే పల్లి మండల కేంద్రంలో లారీ ఢీకొని ఓ కోడి మృతి చెందింది. ఈ ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. కోడి మృతితో గ్రామస్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగడంతో వాహనాలు రహదారిపై ఇరువైపులా నిలిచిపోయి రాకపోకలు స్థంభించిపోయాయి. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి రాకపోకలను పునరుద్దరించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని పోచమ్మవాడలో బాబాసాగర్ గ్రామానికి వెళ్ళే రహదారిపై కంకర లోడ్ తో వెళుతున్న లారీ ఢీ కొని ఓ కోడి అక్కడికక్కడే మృతి చెందింది.
మృతి చెందిన కోడి గ్రామానికి చెందిన దంద్రె బండయ్యకు చెందినది. కాగా కోడి యజమానితో పాటు గ్రామస్థులు ప్రమాదానికి కారణమైన లారీని అడ్డుకొని డ్రైవర్ ను నిలదీశారు. ఆగ్రహంతో గ్రామస్థులు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దీంతో లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయి రాకపోకలు స్థంభించిపోయాయి. దాదాపు రెండు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రామస్థులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. దీంతో రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. అయితే తమ గ్రామం మీదుతో లారీలను ఇష్టారీతిన నడుపుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వేగంగా నడపడంతోనే ఈరోజు కోడి మృతి చెందిందని, ఒకవేళ మనుషులకు తగిలితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.
లారీతో ఢీకొట్టి కోడి మృతికి కారకుడైన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రమాదంలో మృతి చెందిన కోడి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా పోలీసులు గ్రామస్థులకు సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేసిన పోలీసులు కోడి యజమానితో సయోధ్య కుదిర్చేందుకు కూడా ప్రయత్నించారు. ఇదిలా ఉంటే లారీ ఢీకొని కోడి మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారి తీయడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.